శుద్ధదండగే!

high school students struggling for drinking water - Sakshi

తాగునీటి కోసం విద్యార్థుల ఇక్కట్లు

ఇంటినుంచి బాటిళ్లు తెచ్చుకుంటున్న వైనం

నీళ్లులేక నిరుపయోగంగా వాటర్‌ ఫిల్టర్‌ 

భూత్పూర్‌ : మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో తాగునీటికి విద్యార్థులు నానా తంటాలు పడుతున్నారు. ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఐదు వందలకు పైగా విద్యనభ్యసిస్తున్నారు. ఇదివరకు పాఠశాలలో ఉన్న చేతిపంపునకు మోటార్‌ బిగించి నీటి సరఫరా చేసేవారు. క్రమక్రమంగా వర్షాలు పడకపోవడంతో బోరు వట్టిపోయింది. దీంతో పంచాయతీ వారు నూతనంగా బోరు వేసి మోటారు బిగించారు. కొన్నిరోజులపాటు నీరు వచ్చినా.. ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌ నిధులతో మంజూరైన వాటర్‌ ఫిల్టర్‌ను జూన్‌ 25న మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కాటేపల్లి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి వచ్చి ప్రారంభించారు. వాటర్‌ ఫిల్టర్‌ ప్రారంభించిన వారానికే బోరు వట్టిపోయింది. ఫలితంగా విద్యార్థులకు నీటి సమస్య మొదటికొచ్చింది.
  
పాఠశాల బయటే మూత్రవిసర్జన 
ఉన్నత పాఠశాలలో నీరు లేకపోవడంతో పాఠశాల బయటనే విద్యార్థులు మూత్రవిసర్జనకు వెళ్తున్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీనీలకు సైతం వంట చేయడానికి ఇబ్బందిగా మారింది. విద్యార్థులు చేసేదిలేక ఇంటి నుంచి బాటిళ్లలో నీరు తెచ్చుకుని మధ్యాహ్న భోజన సమయంలో అదే నీటిని తాగుతున్నారు. ఇం టర్‌వెల్‌ సమయంలో హోటల్‌ వద్దకు వెళ్లి తాగాల్సిన దుస్థితి నెలకొంది. పంచాయతీ బోరు దూరంగా ఉండటంతో పాఠశాలకు నీరందించేందుకు వీలులేకుండా పోయింది.  

కొత్త బోరు వేయాలి 
స్కూళ్లు తెరిచిన వారం రోజుల నుంచి నీళ్లు రావడంలేదు. స్కూల్లో ఉన్న బోరు ఎండిపోయింది. తాగడానికి నీళ్లు లేవు. బాటిల్‌ కొని ఇంటినుంచి నీళ్లు తెచ్చుకుంటున్నాం. కొత్త బోరు వేయాలి. నీళ్లు లేకపోతే ఇబ్బందిగా ఉంటుంది.                          
– సునీత, 9వ తరగతి 

ఇంటినుంచి తెచ్చుకుంటున్నాం 
స్కూల్‌లో నీళ్లు లేకపోవడంతో ఇంటి వద్ద నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నాం. క్లాస్‌ మధ్యలో దాహం వేస్తే నీళ్లు లేకపోవడంతో దాహం తీర్చుకోలేకపోతున్నాం. మూత్రశాలలు ఉన్నా.. నీళ్లు లేక బహిరంగ ప్రదేశానికి వెళ్లాల్సి వస్తోంది.       
– రాజశేఖర్, 9వ తరగతి 

Read latest Mahabubnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top