అతడి కళ్లే నన్ను మోసం చేశాయి

Love Failure Story Of A Lady - Sakshi

నాకు ఎలాంటి సెంటిమెంట్స్‌ లేవు. అస్సలు ఎవరు ఎలా పోయిన ఫర్వాలేదు. నాకు నేనున్నా అది చాలు అనుకునే అమ్మాయిని నేను. నా లక్షణాలు చెబుతున్నా కానీ, నా లక్షణమైన పేరు చెప్పలేదు కదూ ! నా పేరు పూజ. హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నా. ఎవరినీ పట్టించుకోని నాకు అన్నీ తానైపోయాడు వర్థన్‌. జీవితం ఎంత అందంగా ఉంటుందో చూపించి తాను మాత్రం నా జీవితంలో నుంచి వెళ్లిపోయాడు. 

మా ఫ్యామిలీలో నలుగురం ఉంటాం. నేను, అమ్మ, నాన్న, అన్నయ్య. నాకు తెలిసిన ప్రపంచం వీరే. ఎందుకంటే అమ్మనాన్నలు పెద్దలని ఎదిరించి లవ్‌ మ్యారేజ్‌ చేసుకోవడంతో అందరికి దూరంగా ఉండేవాళ్లం. అమ్మ బంధువుల ఇంటికి మమ్మల్ని నాన్న ఎప్పూడూ పంపేవారు కాదు. నాన్న బంధువులు మమ్మల్ని రానిచ్చేవారు కాదు. ఈ బాధలన్ని తెలిసిన నాన్న మేం ఎక్కడ ప్రేమించి కష్టాలు తెచ్చుకుంటామో అని మమ్మల్ని చాలా స్ట్రిక్ట్‌గా పెంచారు. ఎవ్వరితో మాట్లాడకుండా, ఏ ఫంక్షన్లకు పంపకుండా ఒక్కరమే ఉండేవాళ్లం. కానీ నా మనసు మాత్రం స్వేచ్ఛను కోరుకునేది. అలా స్వేచ్ఛ కోరుకుంటున్న నాకు బీటెక్‌లో హాస్టల్లో ఉండేసరికి రెక్కలు వచ్చినట్లు అనిపించింది. ప్రెండ్స్‌తో కలసి క్లాస్‌లు ఎగ్గొట్టి సినిమాలు, షికారులు అంటూ ఎంజాయ్‌ చేయడం మొదలు పెట్టాను. అప్పుడు ఒక ఫ్రెండ్‌ ద్వారా పరిచయమయ్యాడు వర్ధన్‌. మా కాలేజీనే కాకపోతే వేరే బ్రాంచ్‌.

మేం మాట్లాడుకున్నది తక్కువ సార్లే కానీ తన మాటలు, తన ఆలోచన విధానం నాకు బాగా నచ్చాయి. మా నాన్న ఆలోచనలకి పూర్తి భిన్నంగా ఉన్నాయి తన ఆలోచనలు. అందుకేనేమో వెంటనే కనెక్టయ్యాను. నెమ్మది నెమ్మదిగా ఎక్కువ సేపు మాట్లాడుకోవడం స్టార్‌ చేశాం. తన ఆవేశం, మొండితనం నాకు చాలా బాగా నచ్చేవి. తన కళ్లల్లో నా మీద చాలా ప్రేమ కనిపించేది. నేను కనిపించగానే అతని కళ్లల్లో ఒక మెరుపు వచ్చేది. ఇంకా ఆలస్యం చేయకూడదని వెంటనే ఒకరిమీద ఉన్న ఇష్టం మరొకరితో పంచుకున్నాం. ఇద్దరికి ఇష్టం కావడంతో చాలా హ్యాపీగా ఉండేవాళ్లం. తనెప్పుడు అందరిలా నువ్వంటే నాకు ఇంత ఇష్టం అంత ఇష్టం అని చెప్పే వాడు కాదు. ఏది వ్యక్తపరిచేవాడు కాదు. కానీ నాకు తన కళ్లే అన్ని చెప్పేవి. అలా కొన్ని రోజులు అయ్యాక మా చదువు అయిపోయి ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయాం. చాలా గ్యాప్‌ వచ్చేసింది. ఫోన్‌లో కూడా నెలకు ఒకసారి 5 నిమిషాలు మాట్లాడేదాన్ని అంతే.

అలా మూడేళ్లు గడిచిపోయాయి. ఉద్యోగం సాకుతో ఎలాగో హైదరాబాద్‌ వచ్చేశాను. వర్థన్‌ మాత్రం కోచింగ్‌ కోసం ఢీల్లీ వెళ్లాడు. మేం కలిసింది తక్కువే. మాట్లాడుకుంది తక్కవే అయినా ఒకరిమీద ఒకరికి చాలా ప్రేమ. ఎవ్వరిని పట్టించుకోని నేను ఎలా మారిపోయానంటే ఏ డ్రెస్‌ కొన్నా ‘‘ఇది వర్థన్‌కు నచ్చుతుందా? లేదా?’’ అని ఆలోచించడం మొదలుపెట్టాను. తను బాగుంది అంటే చాలు నాకు నచ్చకపోయినా అతను చెప్పింది చేసేంతలా మారిపోయాను. కేవలం తన కోసం బతికితే చాలు అనిపించేది. అలా సంతోషంగా ఉంటున్న సమయంలో నాకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. నాలో కంగారు మొదలైంది. ఎందుకంటే వర్థన్‌కు ఇంకా జాబ్‌ రాలేదు. ఎలాగో కష్టపడి చాలా సంబంధాలు చెడగొట్టుకున్నాను. అలా కొంత కాలం గడిచాక వర్థన్‌కు మంచి సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ వచ్చింది. చాలా సంతోషం అనిపించింది. వెంటనే ఇద్దరి ఇళ్లలో మా విషయం చెప్పేశాం. కానీ వాళ్ల ఇంట్లో వాళ్లకి మాత్రం మా కన్నా మంచి సంబంధం వస్తుందని వద్దు అన్నారు.

నేను మాత్రం ఎన్ని సంబంధాలు వచ్చినా తనతో ఉండే ఆనందం డబ్బుతో రాదనుకున్నాను. అన్ని విషయాల్లో అందరిని ఎంతో ధైర్యంగా ఎదిరించే వర్ధన్‌ ఈ విషయంలో నాకోసం నిలబడలేదు. తరువాత నాతో మాట్లాడలేదు. నేను ఏ దైర్యం, మొండితనం అయితే చూసి తనని ఇష్టపడ్డానో అవి తనలో లేవు అని అర్ధం అయ్యింది. నాకు కూడా ఎందుకో తనతో మాట్లాడి ‘‘ఎందుకు ఇలా చేశావు?’’ అని అడగాలనిపించలేదు. అందుకే మౌనంగా ఉండిపోయాను.  తన కళ్లల్లో కనిపించేది ప్రేమ అని నన్ను నేను ఇంతకాలం మోసం చేసుకున్నానని నాకు అర్ధం అయ్యింది. కానీ ఇప్పటికీ నా మనసు మాత్రం వర్ధన్‌ కోసమే ఎదురు చూస్తోంది. ఎవ్వరినీ అతని స్థానంలో ఊహించుకోలేకపోతోంది. నా చేతుల్లో ఏం లేదు. నా ప్రేమ నిజమైతే వర్ధన్‌ నా కోసం వస్తాడని నమ్మడం తప్ప. నాది మూర్ఖత్వం అని అందరూ అంటారు. కానీ నాకు మాత్రమే తెలుసు అది ప్రేమ అని.
- పూజ 

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top