ఆన్‌లైన్‌లో ప్రేమ, పెళ్లి ఎర.. జాగ్రత్త!

Five Signs That You Are Being Catfished Online - Sakshi

ప్రస్తుతం ప్రేమ, పెళ్లిళ్ల పేరిట సైబర్‌ నేరాలు ఎక్కువయ్యాయి. సోషల్‌ మీడియాతో పాటు డేటింగ్‌ ఆప్‌, ఆన్‌లైన్‌ వివాహ వేదికల సంస్కృతి కూడా దేశంలో వేగంగా విస్తరిస్తోంది. తద్వారా ముఖ పరిచయం లేని వ్యక్తులతో ప్రేమ కలాపాలు, పెళ్లి సంబంధాలు నట్టేటముంచుతున్నాయి. సోషల్‌ మీడియా, డేటింగ్‌ ఆప్స్‌ను వాడుతున్న.. ఆన్‌లైన్‌ వివాహ వేదికల్లో తమ వివరాలు నమోదు చేసుకున్న చాలా మంది మోసాలకు గురవుతున్నారు. సైబర్‌ నేరగాళ్లు మారు పేర్లు, ఫొటోలతో నమ్మించి లక్షల రూపాయలు దోచేస్తున్నారు. ఆడ, మగ అన్న తేడాలు లేకుండా అందరూ సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల జరగబోయే ప్రమాదాలను ముందుగా గుర్తించి, నివారించవచ్చు. సోషల్‌ మీడియా, డేటింగ్‌ ఆప్‌, ఆన్‌లైన్‌ వివాహ వేదికల ద్వారా పరిచయమైన వ్యక్తులతో చాటింగ్‌​ చేస్తున్నట్లయితే క్రింది విషయాలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్త పడాలి.

1) నేరుగా కలవకపోవటం
మీతో చాటింగ్‌ చేస్తున్న ఆవతలి వ్యక్తి మీకు దగ్గరలో ఉండి మిమ్మల్ని కలవటానికి ఇష్టపడటం లేదా? ఎన్నిసార్లు అడిగినా కలవకుండా ఏదో సాకు చెప్పి వాయిదా వేస్తున్నాడా? అయితే జాగ్రత్తగా ఉండండి. ఫేక్‌ ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసి ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడేవారు ఎక్కువగా సాకులు చెప్పి తప్పించుకోవటం పరిపాటి. నేరుగా కలిస్తే తమ గుట్టు ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో వారు కలవటానికి ఇష్టపడరు.

2) వీడియో చాటింగ్‌
ఆవతలి వ్యక్తి విదేశాల్లో లేదా మీకు చాలా దూరంగా ఉండి నేరుగా కలవకపోయినా కనీసం వీడియో చాటింగ్‌ చేయటానికన్నా ఇష్టపడినట్లయితే మంచిదే. లేదంటే ఇది ఖచ్చితంగా అనుమానించాల్సిన విషయం. సెల్‌ఫోన్‌ పనిచేయటం లేదనో కెమెరా పాడయిందనో సాకులు చెబుతుంటారు. ఫేక్‌ ఫొటోలతో ఆడిన డ్రామా వీడియో చాటింగ్‌లో తేలిపోతుందన్న భయంతో చాటింగ్‌కు అస్సలు ఒప్పుకోరు.

3) డబ్బులు అడుగుతున్నారా?
సైబర్‌ నేరగాళ్లు ఎక్కువగా డబ్బులు ఆశించే మోసాలకు పాల్పడుతుంటారు. అన్ని రకాలుగా ప్రయత్నించి మనం వారిని పూర్తిగా నమ్మేలా చేసుకుంటారు. ఎంతలా అంటే వారిని అనుమానించటానికి కూడా మనం సాహసించనంతగా. సోషల్‌ మీడియా, డేటింగ్‌ ఆప్స్‌ ద్వారా అయితే డబ్బులు రాబట్టడానికి మన భావోద్వేగాలతో ఆటలాడుకుంటారు! ఎమోషనల్‌ బ్లాక్‌ మెయిల్‌ చేస్తారు. అత్యవసరమైన పనికోసం డబ్బులు కావాలని తర్వాత వెనక్కు తిరిగిస్తామని నమ్మిస్తారు. ఇక వివాహ వేదికల విషయంలో ఎక్కువగా గిఫ్టులు పంపిస్తున్నామనో, తమకు సంబంధించిన విలువైన వస్తువులు భద్రపరచండనో నమ్మిస్తారు. ఆ తర్వాత మీకో వస్తువు వచ్చిందంటూ ఓ ఫోన్‌ కాల్‌ వస్తుంది. కొంత డబ్బులు కడితే ఆ వస్తువు మీకు చేరుతుందంటారు. డబ్బులు కట్టిన తర్వాత పత్తాలేకుండా పోతారు.

4) పొంతన లేని సమాధానాలు..
చీటింగ్‌ చేయటానికి చాటింగ్‌ చేస్తున్న వ్యక్తులు ప్రతిసారి పొంతనలేని సమాధానాలు చెబుతుంటారు. పరిచయం అయిన మొదట్లో చెప్పిన వివరాలను మరలా అడిగినపుడు తప్పుతప్పుగా చెబుతుంటారు. కుటుంబ వివరాలు, వ్యక్తిగత జీవితం, ఉద్యోగం ఇలాంటి విషయాలపై అవగాహన లేకుండా మాట్లాడుతుంటారు.

5) వ్యక్తిగత చిత్రాలు, వీడియోలు
సోషల్‌ మీడియా వేదికగా ఆడవారి జీవితాలతో చెలగాటమాడుకుంటున్నారు కొందరు మృగాళ్లు. ప్రేమ పేరుతో పూర్తిగా నమ్మించి వారి నగ్న చిత్రాలను, వీడియోలను సంపాదిస్తున్నారు. అనంతరం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తామంటూ బ్లాక్‌ మెయిల్‌ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. మీరు ఎదుటి వ్యక్తిని ఎంత నమ్మినా.. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వ్యక్తిగతమైన(న్యూడ్‌) ఫొటోలు, వీడియోలను పంచుకోకండి. ఫొటోలు, వీడియోలకోసం పట్టుబడుతున్నట్లయితే వారికి దూరంగా ఉండటం మంచిది.



లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top