పరిమళించిన మానవత్వం

nursing student delivered pregnant women in kurnool passenger train - Sakshi

రైలులో మహిళ ప్రసవం

కానిస్టేబుల్‌ చొరవ..

కాన్పు చేసిన నిర్సింగ్‌ విద్యార్థిని

తల్లీబిడ్డ క్షేమం

 రైలులో వెళ్తుండగా ఓ గర్భిణికి పురిటి నొప్పులు రావడం.. అక్కడే ఉన్న ఓ  కానిస్టేబుల్‌ స్పందించి ప్రయాణికుల సాయం కోరడం.. స్పందించిన ఓ నర్సింగ్‌ విద్యా ర్థిని కాన్పు చేయడం.. సదరు మహిళ పండంటి శిశువుకు జన్మనివ్వడం చకచకా జరిగిపోయాయి. ఈ ఘటన గురువారం కర్నూలు వెళ్లే ప్యాసింజర్‌ రైలులో చోటుచేసుకుంది.

వెల్దుర్తి /డోన్‌:   రైలులో పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణికి సుఖప్రసవం చేయడం ద్వారా మానవత్వాన్ని చాటుకున్నారు తోటి ప్రయాణికులు. ప్రయాణికుల సమాచారం మేరకు.. తుగ్గలి మండలం గిరిగెట్ల గ్రామ మాజీ సర్పంచ్‌ లింగయ్య కుమార్తె సుమలతను బళ్లారికి చెందిన శివకు ఇచ్చి రెండేళ్ల క్రితం వివాహం జరిపించారు. సుమలత తన మొదటి కాన్పు నిమిత్తం పుట్టింటిలో ఉంటోంది. నెలలు నిండడంతో కాన్పు కోసం గుంతకల్లు నుంచి కర్నూలుకు వెళ్లే ప్యాసింజర్‌ రైలును తుగ్గలి రైల్వే స్టేషన్‌లో ఎక్కింది.

రైలు డోన్‌ స్టేషన్‌ దాటిన తర్వాత సుమలతకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అదే రైలులో ప్రయాణిస్తున్న డోన్‌ సబ్‌జైలు కానిస్టేబుల్‌ లక్ష్మీనారాయణ వెంటనే అప్రమత్తమై రైలు బోగీల్లో ఉన్న ప్రయాణికులందరికీ విషయం చెబుతూ సాయం అర్థించాడు. దీంతో డోన్‌ మండలం యు. కొత్తపల్లెకు చెందిన, కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో నర్సింగ్‌ చేస్తున్న మునియల్‌ వెంటనే స్పందించి కాన్పు చేసేందుకు ముందుకు వచ్చింది. నర్సింగ్‌ విద్యార్థిని గర్భిణి, ఆమె కుటుంబ సభ్యులకు  ధైర్యం చెబుతూ సుఖప్రసవం చేసింది. చివరకు సుమలత పండంటి శిశువుకు జన్మనివ్వడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కానిస్టేబుల్, నర్సింగ్‌ విద్యార్థినికి కృతజ్ఞతలు తెలిపిన వారు కర్నూలు ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు.

Read latest Kurnool News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top