ఖమ్మంకు 25న సీఎం కేసీఆర్‌ రాక? 

 Come On CM KCR On Khammam 25 - Sakshi

రెండుచోట్ల ప్రచార సభలకు కసరత్తు 

16న జరగాల్సిన కేటీఆర్‌ ఖమ్మం సభ రద్దు 

సీఎం పర్యటన ఖమ్మం, కొత్తగూడెంలో సాగే అవకాశం 

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా సీఎం కేసీఆర్‌ ఈనెల 25, 26 తేదీల్లో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు తెలిసింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పార్టీ నేతలు ప్రచార సభలకు ఏయే ప్రాంతాలను ఎంపిక చేయాలనే అంశంపై కసరత్తు చేస్తున్నారు. తొలుత క్షేత్రస్థాయి ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించిన టీఆర్‌ఎస్‌.. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో ఈనెల 16వ తేదీన ఖమ్మంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ నేతృత్వంలో జరగాల్సిన ఎన్నికల సన్నాహక సమావేశాన్ని సైతం రద్దు చేసుకుంది.

ఎన్నికలకు సమయం సమీపించడం.. ప్రవర్తనా నియమావళి అమలులోకి రావడం.. జిల్లావ్యాప్తంగా పలుచోట్ల బహిరంగ సభలు నిర్వహించాల్సిన అవసరాన్ని గుర్తించిన పార్టీ నేతలు 16న జరగాల్సిన సమావేశాన్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది. అదేరోజు ఉదయం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలో ఉన్న మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం సైతం రద్దయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేందుకు కేటీఆర్‌ సభ ఉపయోగపడుతుందని నేతలు భావించారు.

అయితే ఎన్నికల సమయం ముంచుకురావడంతో ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాలపై టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈనెల 25, 26 తేదీల్లో సీఎం కేసీఆర్‌ ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు అవకాశం ఉందని సమాచారం. జిల్లా కేంద్రమైన ఖమ్మంతోపాటు ఖమ్మం లోక్‌సభ పరిధిలో ఉన్న కొత్తగూడెం లేదా అశ్వారావుపేటలో కేసీఆర్‌ ఎన్నికల ప్రచార సభ నిర్వహించేందుకు గల అవకాశాలను పార్టీ నేతలు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. 

వేడెక్కిన రాజకీయ వాతావరణం 
ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన వెంటనే జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఆయా రాజకీయ పక్షాలు ఈ ఎన్నికల్లో తమ గెలుపు గుర్రాలను ఎంచుకునే పనిలో నిమగ్నం కాగా.. ఆయా పార్టీలకు చెందిన పలువురు నేతలు ఎంపీగా ఖమ్మం లోక్‌సభ నుంచి బరిలోకి దిగేందుకు పార్టీల నుంచి గ్రీన్‌సిగ్నల్‌ పొందేందుకు తమవంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

ఈనెల 16న కేటీఆర్‌ ఖమ్మం జిల్లా కేంద్రంలో పర్యటించి.. పెవిలియన్‌ గ్రౌండ్‌లో జరిగే ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని తొలుత కార్యక్రమం ఖరారైంది. ఆదివారం ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో స్వల్ప వ్యవధిలోనే బహిరంగ సభలు, సన్నాహక సభలు వేర్వేరుగా నిర్వహించడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులు, క్షేత్రస్థాయిలో ప్రచారానికి కలిగే ఆటంకాలను పరిగణనలోకి తీసుకున్న టీఆర్‌ఎస్‌ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ బహిరంగ సభకే మొగ్గు చూపినట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే ఈనెల 18న ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కావడంతోపాటు అదేరోజు నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. అయితే నామినేషన్లు స్వీకరించే తేదీ నాటికి ఖమ్మం టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని అధికారికంగా ఖరారు చేస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఉపసంహరణ తర్వాత ఎన్నికల ప్రచారానికి కేవలం 12 రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఈ సమయాన్ని క్షేత్రస్థాయి ప్రచారం కోసం వెచ్చించాలని పార్టీ ముఖ్య నేతల నుంచి జిల్లా నేతలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది.

సీఎం కేసీఆర్‌ తన పర్యటనకు ముందే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని టీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలతో సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే కేటీఆర్‌ పాల్గొనాల్సిన ఖమ్మం లోక్‌సభ ఎన్నికల సన్నాహక సభకు పార్టీ వర్గాలు ఇప్పటికే పలు ఏర్పాట్లను పూర్తి చేశాయి.

ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ఒకరోజు ముందు వరకు సైతం కేటీఆర్‌ పర్యటన ఏర్పాట్లకు సంబంధించి ముఖ్య నేతలు సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు. ఇంతలోనే ఎన్నికల షెడ్యూల్‌ రావడం, ఎన్నికల ప్రచారానికి సమయం తక్కువగా ఉండడం వంటి కారణాలతో కేటీఆర్‌ ఎన్నికల సన్నాహక సభ మహబూబాబాద్, ఖమ్మం నియోజకవర్గాల్లో రద్దయినట్లు పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.  

Read latest Khammam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top