
ఒప్పందం చేసుకున్న సంస్థలివే..
- నివి ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, ఆస్ట్రేలియా
- ఎస్–2 ఐటీ గ్రూప్ అల్‌పరేటా, అట్లాంటా, అమెరికా
- టెక్నిక్స్ ఇంటిగ్రేషన్ టెక్నాలజీస్ లిమిటెడ్, అమెరికా
- వే ఐటీ సొల్యూషన్స్, కరీంనగర్ ళీడిజిటల్ సర్వీసెస్, కరీంనగర్
- సంస్కృతి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్
- టీజే నోవండీ ఎల్‌ఎల్‌పీ, హైదరాబాద్
- పీఎస్‌ఆర్ సర్వీసెస్, హైదరాబాద్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్
రాష్ట్రంలో ఐటీ రంగాన్ని మరింతగా విస్తరిస్తున్నామని, కరీంనగర్‌ను ఐటీకి కేరాఫ్‌గా మార్చుతామని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. రాష్ట్ర యువతకు చదువుకున్న చోటే ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేస్తు న్నామని చెప్పారు. మంత్రి కేటీఆర్ సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని లోయర్ మానేరు డ్యాం (ఎల్‌ఎండీ) సమీపంలో
రూ.25 కోట్లతో చేపట్టిన ఐటీ టవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఐటీ ఎగుమతులు రూ.56 వేల కోట్ల మేర ఉండగా.. గతేడాది నాటికి రూ.87 వేల కోట్లకు చేరాయని కేటీఆర్ చెప్పారు. ఐటీ రంగంలో వేల సంఖ్యలో ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. తెలంగాణ యువతకు ఐటీ ఉద్యోగాలు కల్పించేందుకు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌లలో ఐటీ టవర్లను నిర్మిస్తున్నామని తెలిపారు. కరీంనగర్‌లో ప్రస్తుతం నిర్మించనున్న టవర్‌తో పాటు మరో టవర్ కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఐటీ కంపెనీలను రాష్ట్రమంతటా విస్తరిస్తామన్నారు.
శంకుస్థాపనతోనే 8 కంపెనీల ఒప్పందాలు
కరీంనగర్ ఐటీ టవర్ పనులకు శంకుస్థాపన చేసిన రోజునే కాసర్ల నాగేందర్‌రెడ్డితోపాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు స్థాపించిన 8 విదేశీ కంపెనీలు ఒప్పందం చేసుకోవడం గర్వకారణమని మంత్రి కేటీఆర్ చెప్పా రు. ఐటీ టవర్‌ను ఏడాదిలో పూర్తిచేసి.. ప్రారంభం రోజే 1,000 మందికి ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. అమెరికాకు వెళ్లి అక్కడ స్థిరపడ్డ మన ప్రాంతానికి చెందినవారితో మాట్లాడుతామని, మరిన్ని కంపెనీలు తీసుకొస్తామని తెలిపారు. అందుకోసమే మరో ఐటీ టవర్‌ను నిర్మించనున్నట్లు వెల్లడించారు. దేశంలో 50 శాతం జనాభా 27 ఏళ్లలోపు యువతేనని, 65 శాతం జనాభా 35 ఏళ్లలోపు వారేనని.. ప్రపంచంతో పోటీపడే పౌరులుగా మనం తయారుకావాలని పిలుపునిచ్చారు.
ఉపాధిని సృష్టించాలి
ప్రపంచంలో ప్రముఖమైన 100 కంపెనీలకు భారతీయులే నాయకత్వం వహిస్తున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు. వాటికి భారతీయులు మేధో సంపత్తిని, నైపుణ్యాన్ని ధారపోస్తున్నారన్నారు. విదేశాల్లో ఐటీ కంపెనీలను నెలకొల్పడంలో తెలంగాణ ఇంజనీర్ల పాత్ర కీలకమన్నారు. హైదరాబాద్ తర్వాత వరంగల్, కరీంనగర్‌లను అవకాశాలకు గమ్యంగా మార్చుతామని, అమెరికాలోని మనవాళ్లు ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా ప్రయత్నిస్తామని తెలిపారు. యువత ఉద్యోగం చేసేవారుగానే ఉండిపోకుండా.. ఉన్నతమైన, కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఉద్యోగాల సృష్టికర్తలుగా ఎదగాలని కేటీఆర్ ఆకాంక్షించారు. యువతకు నాణ్యమైన శిక్షణ కల్పిస్తే ఉపాధి కల్పన సాధ్యమవుతుందని.. ఇందుకోసం తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్ (టాస్క్)ను, టీ–హబ్‌ను కొత్తగా నిర్మించే జరిగే ఐటీ టవర్‌లో నెలకొల్పుతామని తెలిపారు.
ఆశయాలకు తగ్గట్టు పనిచేస్తున్నాం
రాష్ట్ర ప్రజల ఆశయాలకు తగినట్టుగా ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని కేటీఆర్ చెప్పారు. కరెంటు కష్టాలను జయించామని.. కేవలం మూడున్నరేళ్లలో దేశంలోనే సులభతర వాణిజ్య విధానమున్న రాష్ట్రంగా ఎదిగామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ శ్రమతో ఆర్థికవృద్ధి రేటు పెరిగిందని.. దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌గా ఆవిర్భవించిందని చెప్పారు. త్వరలోనే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు, ప్రతీ ఎకరానికి సాగునీరు అందివ్వబోతున్నామని తెలిపారు.
ఐటీ, వాటర్‌హబ్‌గా కరీంనగర్: ఈటల
అభివృద్ధిలో కరీంనగర్ తెలంగాణకు ఆదర్శం కాబోతోందని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఐటీ టవర్ల ఏర్పాటుతో హైదరాబాద్‌తో సమానంగా కరీంనగర్‌లో అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ యావత్తుకు నీరందించే జిల్లాగా కరీంనగర్ ఉంటుందని పేర్కొన్నారు. కాగా సభలో ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, సోమారపు సత్యనారాయణ, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, భానుప్రసాద్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు.
రిసోర్స్ పర్సన్స్‌కు వీఏవోలతో సమానంగా వేతనాలు
మహిళా సంఘాలను ముందుండి నడిపిస్తున్న రిసోర్స్ పర్సన్స్ (ఆర్‌పీ)లకు వీఏవోలతో సమానంగా వేతనాలు అందిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. సోమవారం కరీంనగర్‌లో పలు అభివృద్ధి పనుల పైలాన్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని రిసోర్స్ పర్సన్లందరికీ దీనిని వర్తింపజేయాలని, ఈ మేరకు ఫైలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక మెప్మా ఉద్యోగులకు ఇంటి అద్దె (హెచ్‌ఆర్) పాలసీని అమలు చేస్తామని ప్రకటించారు.