ప్రమాదంతోనే స్పందిస్తారా?

Low hanging wires danger for farmers  - Sakshi

వేలాడుతున్న కరెంట్‌ తీగలు

శిథిలావస్థలో స్తంభాలు

కేటీదొడ్డి : మండలంలో చాలా చోట్ల విద్యుత్‌ స్తంభాలు శిథిలావస్థకు చేరుకొని వంగిపోవడం, వాటి తీగలు కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. ఎప్పుడో దశాబ్దాల క్రితం వేసిన విద్యుత్‌ స్తంభాలను అధికారులు పట్టించుకోకపోవడంతో అవి ఎప్పుడు నేల కూలుతాయో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదకరంగా మారిన స్తంభాలను వేలాడుతున్న తీగలను బాగుచేయాలని అధి కారులకు ఎన్నిమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. గతంలో విద్యుత్‌స్తంభాలు నేలకొరిగి ప్రమాదాలు కూడా జరిగాయని, అంతజరిగినా.. అధికారులు మాత్రం తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు.

తీగలు తెగిపడి..
కొన్ని రోజుల క్రితం ఎర్సందొడ్డిలో విద్యుత్‌ తీగలు తెగిపడి రెండు ఎద్దులు మృతిచెందాయి. మండలంలోని కొండాపురం, కేటీదొడ్డి, గువ్వలదిన్నె, నందిన్నె, కుచినెర్ల, గ్రామాల శివారులో విద్యుత్‌ తీగలు వేలాడుతూ విద్యుత్‌స్తంభాలు ప్రమాదకరంగా మారాయి. గువ్వలదిన్నె స్టేజీ సమీపంలో రోడ్డు పక్కన విద్యుత్‌స్తంభం శిథిలావస్థకు చేరుకొని ప్రమాదకరంగా మారాయి. స్తంభానికి మధ్యలో ఇనుపచువ్వలు పైకితేలాయి. బలమైన గాలులు వీచినప్పుడు విద్యుత్‌స్తంభం కూలిపోయే అవకాశం ఉందని రైతులు భయాందోళన చెందుతున్నారు. కొండాపురం గ్రామ శివారులో స్తంభాలకు విద్యుత్‌ తీగలు కింద నిలబడితే చేతికందేలా ఉన్నాయి. బలమైన గాలులు వీచినప్పుడు విద్యుత్‌తీగలు ఒకదానికి ఒకటి తగిలి నిప్పురవ్వలు ఎగసిపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అదికారులు చర్యలు తీసుకుని ప్రమాదకరంగా మారిన విద్యుత్‌ స్తంభాలను తొలగించి వాటి తీగలను సరిచేయాలని రైతులు కోరుతున్నారు.

భయంగా ఉంది...
పొలం వద్ద విద్యుత్‌ తీగలు చేతికందేలా ఉన్నాయి. పొలం పనులు చేసుకునేటప్పుడు భయమేస్తుంది. బలమైన గాలులు వీస్తే వైర్లు ఒకదానికి ఒకటి తగిలి నిప్పురవ్వలు పడుతున్నాయి. పొలం పనులు చేసుకోవాలంటే భయంగా ఉంది. తీగలు సరిచేయాలి.
– యాదవరాజు, ఎర్సందొడ్డి

సమస్య పరిష్కరిస్తాం.. 
సమస్య ఉన్న మాట వాస్తవమే. ఎర్సందొడ్డి సర్పంచ్‌ స్తంభాలు కావాలని మా దృష్టికి తీసుకొచ్చారు. త్వరలోనే స్తంభాలు వేయిస్తాం. అలాగే కేటీదొడ్డి, నందిన్నె శివారు పొలాల్లో వేలాడుతున్న విద్యుత్‌ తీగలను మా లైన్‌మెన్‌కు చెప్పి తీగలు లాగేలా చూస్తాం.
– పరశురాం, విద్యుత్‌ ఏఈ

Read latest Jogulamba News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top