సూపర్ హిట్: కంగారూకు పంచ్, వీడియో వైరల్ | Zoo keeper punches kangaroo to save dog, video goes viral | Sakshi
Sakshi News home page

సూపర్ హిట్: కంగారూకు పంచ్, వీడియో వైరల్

Dec 8 2016 9:31 AM | Updated on Sep 4 2017 10:14 PM

సూపర్ హిట్: కంగారూకు పంచ్, వీడియో వైరల్

సూపర్ హిట్: కంగారూకు పంచ్, వీడియో వైరల్

కంగారూలు చాలా విచిత్రమైన జంతువులు. అవి అచ్చం మనుషుల్లాగే రెండు కాళ్లతో పరిగెత్తగలవు, మనుషులతో బాక్సింగ్ చేయడానికి కూడా రెడీ అయిపోతాయి.

కంగారూలు చాలా విచిత్రమైన జంతువులు. అవి అచ్చం మనుషుల్లాగే రెండు కాళ్లతో పరిగెత్తగలవు, నాలుగు కాళ్లతోనూ నడుస్తాయి. వేరే జంతువులతో పోరాడుతాయి. మనుషులతో బాక్సింగ్ చేయడానికి కూడా రెడీ అయిపోతాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి ప్రస్తుతం యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. అడవి లాంటి ప్రాంతంలో ఒక కుక్కను కంగారూ తన ముందుకాళ్లతో పీక పట్టుకుని దాంతో ఫైటింగ్ చేస్తుంటే.. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి వెళ్లి దాన్ని అదిలిస్తాడు. అతడు రావడం చూసి కుక్కను మరింత గట్టిగా పట్టుకుంటుంది. అతడు వాటికి దగ్గరగా వెళ్లి దాన్ని బెదిరించేసరికి, కుక్కను వదిలిపెట్టి.. అతడితో పోరాటానికి సై అంటుంది.
 
అచ్చం బాక్సింగ్ రింగ్‌లో తలపడుతున్న ప్రత్యర్థుల్లాగే ఆ వ్యక్తి.. కంగారూ ఎదురెదురుగా కొంచెం గాల్లోకి ఎగురుతూ ఉంటారు. అంతలో ఆ వ్యక్తి కంగారూ ముఖం మీద గట్టిగా ఓ పంచ్ ఇస్తాడు. దాంతో దిమ్మతిరిగిన కంగారూ.. కాసేపు అలాగే ఉండిపోతుంది. అప్పుడు ఆ వ్యక్తి దాన్ని వదిలి ఇవతలకు వచ్చేస్తాడు. అంతలో అటువైపుగా రెండు కుక్కలు వెళ్తుంటాయి. మనిషిని వదిలేసి, వాటి వెంట పడటానికి కంగారూ రెండు కాళ్లతో పరిగెడుతూ వెళ్లిపోతుంది. 
 
ఈ మొత్తం వ్యవహారాన్ని సదరు వ్యక్తితో పాటే జీపులో ఉన్న మరో వ్యక్తి వీడియో తీసి, దాన్ని యూట్యూబ్‌లో షేర్ చేశాడు. దానికి ఇప్పటివరకు 2 కోట్లకు పైగా హిట్లు వచ్చాయి. ఇప్పటికీ ఇంకా అది ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ ఘటన మొత్తం ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్ ప్ఆరంతంలో ఈ సంవత్సరం జూన్ నెలలో జరిగింది. కొంతమంది వేటగాళ్లు కలిసి కేన్సర్‌తో బాధపడుతున్న ఓ వ్యక్తి చివరికోరిక తీర్చడానికి వంద కిలోల బరువున్న అడవిపందిని పట్టుకోడానికి బయల్దేరారు.
 
అడవిపందులు ఎక్కడున్నాయో వాసనను బట్టి తెలుసుకోడానికి తమతో పాటు వేటకుక్కలను కూడా తీసుకెళ్లారు. కానీ, అనుకోకుండా వాటిలో ఒకటి కంగారూ బారిన పడింది. దాన్ని కాపాడే ప్రయత్నంలోనే ఆ కంగారూకు సదరు వేటగాళ్లలో ఒకరు ముఖం మీద బాక్సింగ్ పంచ్ ఇచ్చారు. ఆ వ్యక్తిని టరోరంగా వెస్ట్రన్ ప్లెయిన్స్ జూలోని ఏనుగుల సంరక్షకుడు గ్రెయిగ్ టాన్‌కిన్స్‌గా గుర్తించారు. కంగారూను కొట్టినందుకు అతడిమీద కేసులు పెడతామంటూ జంతు హక్కుల సంఘాల వాళ్లు బెదిరించడంతో.. అతడు జంతువుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాడని, గత ఆరేళ్లుగా తమ జూలో అన్నింటినీ ప్రేమగా చూసుకుంటున్నాడని సదరు జూ వర్గాలు ఒక ప్రకటన కూడా విడుదల చేయాల్సి వచ్చింది. 
Advertisement
Advertisement
 
Advertisement
Advertisement