ప్రపంచంలోనే పొడవైన గాజు వంతెన

World Longest Glass bridge Opening Next Month in China  - Sakshi

కొందరు నాలుగో అంతస్తు నుంచి కిందకు చూడాలంటేనే వణికిపోతారు. వారిని పదో అంతస్తుకి తీసుకెళ్తే.. అది కూడా గాజు వంతెన అయితే..  ప్రపంచంలోనే  గాజుతో తయారుచేసిన ఇలాంటి వంతెనలకు చైనా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు ఇవే చైనాలో ప్రధాన పర్యాటక ఆకర్షణలు. యోగా ప్రదర్శనల దగ్గర నుంచి, వివాహాల వరకు అనేక కార్యక్రమాలు ఈ వంతెనలపై వినూత్నంగా జరుపుకొని చైనీయులు కొత్తదనాన్ని ఆస్వాదిస్తున్నారు. తాజాగా చైనా ప్రపంచంలోనే అత్యంత పొడవైన గాజు వంతెనను నిర్మించింది. గతంలో నిర్మించిన 488 మీటర్లు (1,601 అడుగులు) రికార్డును తనే బద్దలు కొట్టి 550 మీటర్ల పొడవు( 1,804 అడుగులు) గల వంతెనను చైనా నైరుతి ప్రాంతంలోని హుయాంగ్సు ప్రావిన్స్‌లో నిర్మించింది. ఈ ప్రాంతం సుందరమైన జలపాతాలకు, సున్నపురాయి నిర్మాణాలకు ప్రసిద్ధి.

వచ్చే నెలలో గాజువంతెనను ప్రారంభిస్తామని ప్రాజెక్టు డైరెక్టర్‌ పాన్‌ జావోఫు వెల్లడించారు. ప్రకృతిని ఆస్వాదించేవారికి ఈ ప్రదేశం నచ్చి తీరుతుందని తెలిపారు. ‘ఎత్తైన ప్రాంతంలో నడవాలనుకునే వారికి గాజువంతెనపై నడక ఒక ఛాలెంజింగ్‌గా ఉంటుంది. విశ్రాంతి, వినోదం, ప్రేరణ, క్రీడలు, ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలను వినూత్నంగా అందించడం ద్వారా పర్యాటకులను అలరించడానికి ఓ రిసార్ట్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడి గుహలో రెస్టారెంట్‌ కూడా ఉంది’ అని పేర్కొన్నారు. మార్చిలో ప్రారంభించిన ఈ వంతెన నిర్మాణం పూర్తయ్యేసరికి 1 మిలియన్‌ డాలర్లు వ్యయం అయింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top