ఫస్ట్‌ లేడీ.. నువ్వా నేనా?

words war between Melania Trump and Ivana Trump - Sakshi

వీధికెక్కిన ట్రంప్‌ భార్యలు

అమెరికా ఫస్ట్‌లేడీని నేనంటే నేనని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భార్యలు మీడియాకెక్కారు. ఈ గొడవకు ట్రంప్‌ మాజీ(మొదటి)భార్య ఇవానా ఆజ్యం పోయగా.. ప్రస్తుత భార్య మెలానియా ఘాటుగా బదులిచ్చారు. నిజానికి ఫస్ట్‌ లేడీని నేనే అంటూ ఇవానా రెచ్చ గొట్టగా.. పుస్తకాలు అమ్ముకునేందుకు కొంద రు అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, వాషింగ్టన్‌లో ఉండడమే నాకిష్టం అంటూ మెలానియా దీటుగా సమాధానమిచ్చారు. సవతుల పోరులో ఇరుక్కున ట్రంప్‌ మాత్రం ఏం మాట్లాడకుండా మౌనాన్ని ఆశ్రయించారు.   

అమెరికా అధ్యక్షుడి సతీమణిగా ‘ఫస్ట్‌ లేడీ’కి ఉండే హోదా, గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ హోదా నాదంటే నాది అని మెలానియా, ఇవానాలు మీడియాకెక్కడం ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. తాను మళ్లీ ఫస్ట్‌లేడీ కావచ్చునేమోనంటూ ట్రంప్‌ మొదటి భార్య ఇవానా ఈ చర్చకు తెరలేపారు. ట్రంప్‌తో ప్రేమ, పెళ్లి, విడాకుల్ని ప్రస్తావిస్తూ ఆమె రాసిన ‘రైజింగ్‌ ట్రంప్‌’ పుసక్తం ప్రచారం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

‘వైట్‌ హౌస్‌ డైరెక్ట్‌ నంబర్‌ నా దగ్గరున్నా ట్రంప్‌తో మాట్లాడేందుకు అక్కడకు ఫోన్‌ చేయదలుచుకోలేదు. ఎందుకంటే అక్కడ∙మెలానియా ఉంది. ఆమెకు ఎలాంటి అసూ యను కలిగించాలని అనుకోవడం లేదు. వాస్తవంగా నేనే ట్రంప్‌ మొదటి భార్యను.. అప్పుడు నేనే ఫస్ట్‌ లేడీని కదా ?’ అంటూ 68 ఏళ్ల ఇవానా ఈ వివాదానికి ఆజ్యం పోశారు. వివాదాలకు దూరంగా ఉండే మెలానియాకు ఈ వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. 

‘మెలానియా వాషింగ్టన్‌లో ఉండడానికి ఇష్టపడతారు. అమెరికా ఫస్ట్‌ లేడీగా తన బాధ్యతల్ని నిర్వహించడాన్ని గౌరవంగా భావిస్తారు. తన హోదాను, సమయాన్ని పిల్లలకు సాయపడటానికి ఉపయోగిస్తారే తప్ప పుస్తకాలు అమ్ముకోడానికి కాదు’’ అని మెలానియా అధికార ప్రతినిధి స్టిఫేని గ్రీషమ్‌ ఒక ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు.   

ట్రంప్‌ రాసలీలల ప్రస్తావన
మొదటి నుంచి జల్సారాయుడిగానే ట్రంప్‌ పేరుతెచ్చుకున్నారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఆయన మొదటి ఇద్దరికీ విడాకులిచ్చి ప్రస్తుతం మెలానియాతో ఉంటున్నారు. చెకొస్లోవియా మోడల్‌ ఇవానాను 1977లో ట్రంప్‌ మొదటి వివాహం చేసుకున్నారు. 1992లో వారిద్దరు విడిపోయారు. వారి సంతానమే డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌(38), ఇవాంకా ట్రంప్‌ (34), ఎరిక్‌ ట్రంప్‌ (32). 1980లలో ట్రంప్, ఇవానాలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు.ట్రంప్‌ను ‘ది డొనాల్డ్‌’ అని ముద్దుపేరుతో పిలుచుకునేది ఇవానా. అయితే ఇప్పుడు ట్రంప్‌తో ప్రేమ, పెళ్లి, విడాకులు సహా పలు ఆసక్తికర అంశాల్ని ‘రైజింగ్‌ ట్రంప్‌’ పుస్తకంలో ఇవానా బయటపెట్టారు.

ట్రంప్‌ వివాహేతర సంబంధాల బాగోతాన్ని అందులో వివరించారు. ‘మా వివాహ బంధం ముగిసిందని 1989లోనే నాకు అర్థమైంది. ఒక యువతి నా దగ్గరకు వచ్చి తన పేరు మార్లా అని, నా భర్తను ప్రేమిస్తున్నానని చెప్పింది. నేను వెంటనే బయటకు పో.. నేను నా భర్తను ప్రేమిస్తున్నానని గట్టిగా సమాధానమిచ్చాను’ అని పాత సంగతుల్ని పుసక్తంలో ఇవానా గుర్తుచేసుకున్నారు. మార్లా మేపుల్స్‌తో వివాహేతర సంబంధాన్ని 1990లో న్యూయార్క్‌ పోస్టు పత్రిక ‘బెస్ట్‌ సెక్స్‌ ఐ హావ్‌ ఎవర్‌ హాడ్‌’ పేరుతో ప్రకటించడంతో ట్రంప్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.

2005లో మెలానియాతో పెళ్లి
1993లో మార్లా మేపుల్స్‌ (52)ను ట్రంప్‌ వివాహం చేసుకున్నారు. వారిద్దరి సంతానమే టిఫాని ట్రంప్‌ (22). ఆరేళ్ల వైవాహిక జీవితం అనంతరం 1999లో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇక 2005లో మెలానియా(46)ను ట్రంప్‌ పెళ్లిచేసుకున్నారు. స్లొవేనియాలో పుట్టిన ఆమె పలు పత్రికలకు మోడల్‌గా పనిచేశారు. అనంతరం అమెరికాలో స్థిరపడ్డారు. ప్రముఖ పత్రికలు వోగ్, హార్పర్స్‌ బజార్, బ్రిటిష్‌ జీక్యూ, ఓషియన్‌ డ్రైవ్‌ తదితర పత్రికల కవర్‌పేజీలపై ఆమె ఫోటోలు ప్రచురితమయ్యాయి. వారిద్దరి సంతానమే బర్రోన్‌ ట్రంప్‌ (10).

–సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top