హాకింగ్‌కు ఎందుకు నోబెల్‌ రాలేదు?

Why Stephen Hawking Didnt Get Noble Prize ? - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భూమిపై మానవ మనుగడకు ప్రమాదం పొంచి ఉందని తొలిసారిగా హెచ్చరించి వారు ఇతర గ్రహాల్లో వీలయినంత త్వరగా నివాసాలు ఏర్పాటుచేసుకోవాలని హెచ్చరించిన తొలి భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌. కాలం గుట్టును శోధించేందుకు యత్నించడమే కాకుండా, కృష్ణబిలాల రహస్యాలపై అహర్నిషలు కృషిచేసిన ఆయన బుధవారం కన్నుమూశారు. మానవాళికి అద్భుతమైన సేవలు అందించి, గొప్ప పరిజ్ఞానాన్ని, ఎవరూ ఊహించని రహస్యాల గుట్టును చెప్పిన ఆయనకు ఎందుకు నోబెల్‌ బహుమతి రాలేదని ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. బ్లాక్‌ హోల్‌ లు చనిపోతాయి అంటూ ఆయన వెల్లడించిన కొత్త సిద్ధాంతానికైనా నోబెల్‌ వచ్చి ఉండాలి కదా అని ప్రశ్నించుకుంటున్నారు.

కృష్ణబిలాల గురించి సంక్షిప్తంగా..
బ్లాక్ హోల్స్‌ను తెలుగులో కృష్ణ బిలాలు అని అంటారు. ఆకాశంలో మనం చుక్కలుగా పిలుచుకునే నక్షత్రాలు వాటి స్వరూపం, వయసు, పదార్థ ద్రవ్య రాశుల ఆధారంగా రకరకాల మార్పులకు లోనవుతాయి. చివర దశకు చేరుకుంటాయి. కొన్ని నక్షత్రాలు వాటిలో ఉండే హైడ్రోజన్ పూర్తిగా అయిపోయాక శక్తిని విడుదల చేయలేనివిగా మారతాయి. దాంతో నక్షత్రాలలో ఉండే హీలియం తదితర పదార్థాల కేంద్రకాలను విడిగా ఉంచే ఉష్ణ శక్తి నశిస్తుంది. దాంతో ఆ పదార్థాలన్నీ అంతరంగికంగా గురుత్వాకర్షణ బలానికి గురై ఆవగింజంత పరిమాణం (చిన్న సైజు)లోకి కుంచించుకుపోతాయి. అయితే అన్ని నక్షత్రాలూ బ్లాక్ హోల్స్‌గా మారాలని ఏమీ లేదు. సూర్యుడికంటే సుమారు ఒకటిన్నర రెట్లు ఎక్కువ పరిమాణం కలిగినట్టివే కృష్ణబిలాలుగా మారతాయని ప్రముఖ నోబెల్ బహుమతి గ్రహీత, భారతీయ శాస్త్రవేత్త చంద్రశేఖర్ ఇదివరకే సిద్ధాంతీకరించారు.
 

నోబెల్‌ ఎందుకు రాలేదు?
'హాకింగ్‌ చెప్పిన కృష్ణబిలాలు సిద్ధాంతాన్ని కొంత అనుమానాలతో కూడిన, ఊహించదగిన భౌతిక సిద్ధాంత కేటగిరిలోకి మాత్రమే చేర్చారు. దానిని ప్రామాణికంగా ఆమోదించదగ్గ మార్గం లేదు' అని ది సైన్స్‌ ఆఫ్‌ లిబర్టీ అనే నేషనల్‌ జాగ్రఫిక్‌ మేగజిన్‌ రచయిత తిమోతి ఫెర్రిస్‌ తెలిపారు. బ్లాక్‌ హోల్స్‌ అనేవి అంతమైపోవడానికి చాలా ఏళ్లు పడుతుంది. ఒక అంచనాగా చెప్పాలంటే కొన్ని బిలియన్‌ సంవత్సరాలకుగానీ వాటికి ఏమీ జరగదు. ఇప్పటి వరకు ఏం జరగలేదు కూడా.. అన్నింటికంటే ముందే పుట్టిన ఒక నక్షత్రం సైజు పరిమాణంలోని కృష్ణబిలానికి కూడా ఇప్పటి వరకు ఏమీ కాలేదు' అని ఆయన చెప్పారు. సైద్ధాంతిక పరంగా నిరూపించేందుకు హాకింగ్‌ థియరీకీ అవకాశం లేకపోయినందునే ఆయనకు బహుశా నోబెల్‌ రాకపోయి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top