అమెరికా, రష్యా మధ్య అణు యుద్ధం జరిగితే....

War Between America And Russia What Will Be The Effect - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్‌ విషయమై భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు యుద్ధానికి దారితీస్తాయా? ఆ పరిస్థితే వస్తే సంప్రదాయక యుద్ధంలో గెలవలేని పాకిస్థాన్, భారత్‌పైకి అణ్వాయుధాలు ప్రయోగిస్తుందా ? అదే జరిగితే ఏమవుతుంది ? అని ప్రశ్నిస్తున్న వారు, చర్చిస్తున్నవారు లేకపోలేదు. అదే విధంగా ప్రపంచ అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యాల మధ్య యుద్ధం జరిగితే, అది అణు యుద్ధానికి దారితీస్తే ఇరువైపుల జరిగే నష్టమెంత ? అన్న అంశంపై అనాదిగా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ఊహాగానాలే నిజమై నిజంగా అమెరికా, రష్యా దేశాల మధ్య అణు యుద్ధం జరిగితే నష్టం ఎంతో తేల్చడానికి ‘కంప్యూటర్‌ సిములేషన్‌’ విధానాన్ని నిపుణులు అనుసరించారు. అంటే ఏ దేశం వద్ద ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయి ? అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ? అవి ఎంత దూరం ప్రయాణించగలవు? లక్ష్యాలను కచ్చితంగా పేల్చగలవా ? పేలిస్తే వాటి ప్రభావం ఎంత ? అన్న నిజమైన లెక్కలు తీసుకొని యుద్ధం జరిగితే ఎంత నష్టం వాటిల్లుతుందనే విషయాన్ని నిపుణులు తేల్చి చెప్పారు. ‘ప్రిన్సిటన్‌ యూనివర్శిటీ ఆఫ్‌ కాలేజెస్‌’కు చెందిన ‘ఇంజనీరింగ్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ అఫేర్స్‌’ నిపుణుడు అలెక్స్‌ గ్లాసర్‌ సిములేషన్‌ (అనుకరణ) విధానంలో ప్రయోగం జరిపి నాలుగు నిమిషాల నిడివిగల వీడియోను రూపొందించారు. 

ఆ ప్రయోగం ప్రకారం కొన్ని గంటల్లోనే ఇరుదేశాల మధ్య 3.41 కోట్ల మంది ప్రజలు మరణిస్తారు. 5.59 కోట్ల మంది గాయపడతారు. మొదటి మూడు గంటల్లోనే 26 లక్షల మంది మరణిస్తారు లేదా గాయపడతారు. ఆ తర్వాత 90 నిమిషాల్లోగా ఇరు దేశాల్లోని కీలక నగరాలపై ఒకరికొకరు ఐదు నుంచి పది అణ్వాయుధాలు ప్రయోగించుకుంటారు. వీటి వల్ల 8.87 కోట్ల మంది మరణిస్తారు లేదా గాయపడతారు. ముందుగా వ్యూహాత్మక లక్ష్యాలపైనే ఇరు దేశాలు అణ్వాయుధాల దాడులను ప్రారంభించినా ఆ తర్వాత అనతి కాలంలోనే ప్రధాన నగరాల లక్ష్యంగా దాడులకు దిగుతాయి. అణ్వాయుధాల వల్ల అప్పటికప్పుడే జరిగే ప్రాణ నష్టాన్ని మాత్రమే ఇక్కడ పరిగణలోకి తీసుకున్నారు. ఆ తర్వాత అణ్వాయుధాల పేలుడు ప్రభావం వల్ల ఎంత మంది ప్రజలు చనిపోతారు, భూవాతావరణంపై దాని ప్రభావం ఎలా ఉంటుందన్న అంశాలను ఇక్కడ నిపుణులు పరిగణలోకి తీసుకోలేదు.

ఇక అణ్వాయుధాల ప్రభావం ఒక్క మనుషులపైనే కాకుండా సమస్త జీవజాలంపై ఉంటుంది. కొన్ని తరాల వరకు పంటలు కాదుగదా, గడ్డి కూడా నేలపై మొలవదు. ప్రయోగించిన అణ్వాయుధాన్ని ఎలా డిజైన్‌ చేశారు ? అప్పుడు వాతావరణం ఎలా ఉంది ? పేలుడు జరిగిన చోట ప్రకృతి ఎలా ఉంది ? అన్న అంశాలపై కూడా నష్టం ఆధారపడి ఉంటుంది. సాధారణంగా అణు బాంబు పేలినప్పడు దానిలో 35 శాతం శక్తి ‘హీట్‌’గా బయటకు వస్తుంది. ఒక మెగా టన్ను అణు బాంబు పేలితే అది పగలు 13 మైళ్ల వరకు, అదే రాత్రిపూట అయితే 50 మైళ్ల వరకు కనిపిస్తుంది. పేలుడు వల్ల పరిసర వాయువుల్లో ఏర్పడే ఒత్తిడి వల్లనే పరిసరాల్లోని అనేక భవనాలు కూలిపోతాయి. పేలుడు స్థలానికి 3.7 కిలోమీటర్ల విస్తీర్ణం వరకు గాలులు గంటకు 158 మీటర్ల వేగంతో వీస్తాయి. మధ్యలో వచ్చే ఇళ్లు, భవనాలే కాకుండా వాహనాలు, చెట్లు చేమలు పల్లాల్లా గాలిలో తిరుగుతాయి. 

ఈ విషయాలను పక్కన పెడితే అమెరికాను హెచ్చరించడంలో భాగంగా రష్యా తన తొలి అణ్వాయుధాన్ని నల్ల సముద్రం సమీపంలోని కలినిన్‌గ్రాడ్‌ వద్ద అణ్వాయుధ కేంద్రం నుంచి వార్నింగ్‌ షాట్‌ విడుదల చేస్తుంది. అందుకు ప్రతీకారంగా అమెరికా లేదా నాటో ఏకైక వ్యూహాత్మక అణ్వాయుధాన్ని ప్రయోగిస్తుంది. అంతే యూరప్‌ అంతట అణ్వాయుధ యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయి. ఆ వెంటనే అన్ని నాటో అణ్వాస్త్రాలు లక్ష్యంగా రష్యా విమానాల ద్వారా గానీ, క్షిపణుల ద్వారాగానీ దాదాపు 300 అణుబాంబులను ప్రయోగిస్తుంది. అప్పుడు అంతర్జాతీయ సైనిక కూటమి స్పందిస్తుంది. అప్పుడు రష్యా అణ్వాయుధ కేంద్రాలను లక్ష్యంగా పెట్టుకొని నాటో కూటమి దాదాపు 600 అణు బాంబులను ప్రయోగిస్తుంది. ఆ తర్వాత ఇరు దేశాలు చెరి 30 నగరాలు లక్ష్యంగా అణ్వాయుధాలు ప్రయోగిస్తాయి. దీంతో 3.41 లక్షల మంది ప్రజలు మరణిస్తారు.

తొలిదశ యుద్ధం ముగిసేప్పటికీ ఇరు దేశాల మధ్య దాదాపు పది కోట్ల మంది మరణిస్తారు లేదా గాయపడతారు. భారత్, పాక్‌ వద్ద ఉన్న అణ్వాయుధాలను, వాటి సామర్థ్యాన్ని అంచనా వేసి ఇదే ‘సిములేషన్‌’ విధానం ద్వారా ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగితే జరిగే నష్టం ఎంతో కూడా అంచనా వేయవచ్చు. ఇరుదేశాల అణ్వాయుధాలకు సంబంధించి ఇప్పటి వరకు వెలువడిన పలు అంతర్జాతీయ నివేదికల ప్రకారం భారత్‌ వద్ద దాదాపు వంద అణ్వాయుధాలు ఉంటే పాకిస్థాన్‌ వద్ద 125 వరకు అణ్వాయుధాలు ఉన్నాయి. అంటే మనకన్నా పాతిక ఆయుధాలు ఎక్కువ. సామర్థ్యం విషయంలో భారత అణ్వాయుధాలకు ఎక్కువ ఉండే అవకాశం ఉంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top