లష్కర్ ఇ తాయిబాకు నిధుల సేకరణ.. కీలక సభ్యుడిగా బాధ్యతలు చేపట్టిన మోస్ట్ వాంటెడ్...
ఉప ఎన్నికల్లో ఉగ్రవాది పోటీ!
Sep 12 2017 12:03 PM | Updated on Apr 4 2019 5:12 PM
సాక్షి, లాహోర్: మహ్మద్ యాకూబ్ షేక్.. లష్కర్ ఏ తాయిబా ఉగ్రవాద సంస్థ కీలక సభ్యుడు. అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. అలాంటి షేక్ త్వరలో పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ(పార్లమెంట్) ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు. షరీఫ్ ఉద్వాసనతో ఖాళీ అయిన ఎన్‌ఏ-120 నియోజకవర్గం నుంచే అతను ఎంపీగా పోటీ చేయబోతున్నాడు.
ఈ మేరకు ఎల్‌ఈటీ అనుబంధ సంస్థ అయిన డిఫా-ఎ-పాకిస్థాన్ కౌన్సిల్ మద్ధతు ఇవ్వాలంటూ మిగతా పార్టీలకు ఓ బహిరంగ లేఖ విడుదల చేసింది. సెప్టెంబర్ 17న జరగబోయే ఎన్నికల్లో ప్రజలంతా అయూబ్ యాకూబ్ కు ఓటేసి గెలిపించాలని డిఫా పెద్దలు విజ్ఞప్తి చేశారు. యాకూబ్ ఓ గొప్ప దేశ భక్తుడని, సేవ చేసే అవకాశం కల్పించాలంటూ ప్రజలను డిఫా కోరారు. ఎనర్జీ బల్బు గుర్తుతో అయూబ్ పోటీ చేయబోతున్నాడు. మిల్లీ ముస్లిం లీగ్ పార్టీ(హఫీజ్ సయ్యద్ స్థాపించిన పార్టీ) తరపున పోటీ చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా, పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్న ఉగ్రవాద కీలక సభ్యులంతా రాజకీయాల్లోకి అడుగుపెట్టడం పరిపాటిగా మారిపోయింది. 1972 భవల్‌పూర్‌లో జన్మించిన యాకూబ్ లష్కర్ ఏ తాయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్‌కు అత్యంత సన్నిహితుడు. లాహోర్ ముస్లిం యూనివర్సీటీ నుంచి డిగ్రీ పట్టా పొందాడు. ఉగ్రసంస్థలో కీలక సభ్యుడిగా ఉన్న యాకూబ్ ఏడాదికి మూడు నాలుగు సార్లు సౌదీ ఆరేబియా వెళ్తూ నిధుల సేకరణ చేపడుతుంటాడు. పలు కీలక బాధ్యతలను కూడా నిర్వహించిన యాకూబ్. మరికొన్ని ఉగ్రసంస్థల్లో కూడా సహయకుడిగా పని చేశాడు. 2012 లొ అమెరికా ట్రెజరీ సంస్థ యాకూబ్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించి మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో కూడా చేర్చింది. ప్రస్తుత ఎన్నికల్లో పీఎంఎల్(ఎన్) అభ్యర్థి కుల్సుమ్ నవాజ్‌పై యాకూబ్ తలపడబోతున్నారు.
Advertisement
Advertisement