భారత్‌కు అండగా అమెరికన్‌ బలగాలు

US Says Reviewing Global Force Posture To Counter China - Sakshi

చైనాకు చెక్‌

వాషింగ్టన్‌ : భారత్‌ సహా పలు ఆసియా దేశాలకు చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ నుంచి ఎదురవుతున్న ముప్పును నిలువరించేందుకు తమ అంతర్జాతీయ బలగాలను తరలించే అవకాశాన్ని సమీక్షిస్తున్నామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో పేర్కొన్నారు. చైనా సైన్యాన్ని దీటుగా నిలువరించేందుకు సన్నద్ధంగా ఉన్నామని, అందుకు అవసరమైన వనరులు సిద్ధం చేస్తామని బ్రజెల్స్‌ ఫోరం 2020ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ పాంపియో ఈ వ్యాఖ్యలు చేశారు. జర్మనీలో అమెరికన్‌ బలగాలను 52,000 నుంచి 25,000కు తగ్గిస్తున్న క్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాలకు అనుగుణంగా సైనిక బలగాల సమీక్షను చేపడతామని చెప్పారు.

క్షేత్రస్ధాయి పరిస్థితులకు అనుగుణంగా బలగాల మోహరింపుపై నిర్ణయం​ తీసుకుంటామని చెప్పారు. నిర్ధిష్ట ప్రాంతాల్లో అమెరికన్‌ దళాలున్నాయని, తాజాగా భారత్‌, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా వంటి దేశాలకు చైనా నుంచి ముప్పు నెలకొందని అన్నారు. ఏ ప్రాంతానికినా ముప్పు ఎదురైతే ఇతర దేశాలు బాధ్యత తీసుకుని వారిని రక్షించాల్సిన అవసరం ఉందని, ఈ అంశాలపై ఐరోపా దేశాలతో పాటు తమ భాగస్వాములందరితో సంప్రదింపులు జరుపుతామని పాంపియో పేర్కొన్నారు. కాగా భారత్‌, చైనాల మధ్య సరిహద్దు వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. చర్చల్లో శాంతి మంత్రం జపిస్తున్న చైనా మరోవైపు సరిహద్దుల్లో పెద్దసంఖ్యలో సైన్యాన్ని మోహరిస్తుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. చదవండి : నార్త్‌ కొరియాకు అమెరికా, ద. కొరియా విజ్ఞప్తి!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top