భారత్‌కు ట్రంప్‌

US President Donald Trump Visits India On 24/02/2020 And 25/02/2020 - Sakshi

ఈనెల 24, 25 తేదీల్లో భారత్‌లో అమెరికా అధ్యక్షుడి పర్యటన

వ్యూహాత్మక సంబంధాలు బలోపేతమవుతాయన్న ఇరుదేశాలు 

వాషింగ్టన్‌/న్యూఢిల్లీ: భారత్‌లో అమెరికా అధ్యక్షుడి పర్యటన తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 24, 25వ తేదీల్లో భారత్‌ రానున్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ న్యూఢిల్లీ, అహ్మదాబాద్‌ల్లో పర్యటించనున్నారు. భారత్‌లో ట్రంప్‌ మొదటిసారిగా జరిపే ఈ పర్యటన ద్వారా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను, ప్రజల మధ్య స్నేహాన్ని మరింత పెంచుతాయని అమెరికా తెలిపింది. ఈ పర్యటనలో ట్రంప్‌ వెంట ఆయన భార్య మెలానియా ట్రంప్‌ కూడా ఉంటారని అధ్యక్షభవనం శ్వేతసౌధం ప్రెస్‌ సెక్రటరీ స్టెఫానీ గ్రిషమ్‌ తెలిపారు. గత వారం ట్రంప్, భారత ప్రధాని మోదీ మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ సందర్భంగా ఈ మేరకు ఖరారైనట్లు వెల్లడించారు. పరస్పర విశ్వాసం, ఒకే విధమైన విలువలు, గౌరవం, అవగాహనల ప్రాతిపదికగా భారత్, అమెరికాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం సుహృద్భావ వాతావరణంలో కొనసాగుతోంది’ అని శ్వేతసౌధం వివరించింది.

‘ఈ పర్యటన సందర్భంగా ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సంబంధాల ప్రగతిని సమీక్షించడంతోపాటు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తృతం చేసుకునేందుకు కృషి చేస్తారు’ అని భారత్‌ తెలిపింది. ప్రధాని మోదీ ఆహ్వానంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన భార్య ఈనెల 24, 25వ తేదీల్లో పర్యటించనున్నారని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. న్యూఢిల్లీ, అహ్మదాబాద్‌ పర్యటనల సమయంలో ట్రంప్‌ దంపతులు వివిధ రంగాల  వారితో ముచ్చటిస్తారని తెలిపింది.  రూ.13,500 కోట్ల విలువైన సమగ్ర గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ(ఇంటిగ్రేటెడ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వెపన్‌ సిస్టం)ను భారత్‌కు విక్రయించేందుకు విదేశాంగ శాఖ అంగీకరించిన కొద్దిగంటల్లోనే ట్రంప్‌ పర్యటన ఖరారైనట్లు శ్వేతసౌధం ప్రకటించింది. ట్రంప్‌ కంటే ముందు 2010–2015 సంవత్సరాల మధ్య అధ్యక్షుడిగా ఉన్న ఒబామా భారత్‌లో పర్యటించారు. గత ఏడాది మేలో రెండోసారి ప్రధాని అయిన మోదీ ట్రంప్‌తో 4 పర్యాయాలు భేటీ అయ్యారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top