కూచిభొట్ల కేసులో నిందితుడి నేరాంగీకారం

US man pleads guilty to premeditated murder - Sakshi

వాషింగ్టన్‌: భారతీయ ఇంజనీర్‌ శ్రీనివాస్‌ కూచిభొట్ల హత్య కేసు విచారణ త్వరలో ముగియనుంది. ఈ నేరానికి పాల్పడినట్లు మాజీ నేవీ ఉద్యోగి ప్యూరింటన్‌ అంగీకరించటంతో అతనికి యావజ్జీవ జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. గత ఏడాది ఫిబ్రవరి 22న శ్రీనివాస్‌ తన స్నేహితుడు అలోక్‌ మాడసానితో కలిసి బార్‌లో ఉండగా ప్యూరింటన్‌(52) జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తూ తుపాకీతో వారిపైకి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో గాయపడిన శ్రీనివాస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన సంగతి తెలిసిందే.

దర్యాప్తు అధికారులు పూర్తి ఆధారాలు సమర్పించటంతో తాజాగా జరిగిన విచారణలో తానే ఈ నేరానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. దీనిపై జడ్జి చార్లెస్‌ డ్రోగ్‌ మాట్లాడుతూ..ప్యూరింటన్‌కు హత్య నేరం కింద జీవిత కాల జైలు శిక్ష, హత్యాయత్నానికి 12 నుంచి 54 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముందని చెప్పారు. అయితే, విద్వేషపూరిత నేరం రుజువైతే అదనంగా మరో శిక్ష ఉంటుందని తెలిపారు. తాజా పరిణామాన్ని శ్రీనివాస్‌ భార్య సునయన స్వాగతించారు. ‘ఈ తీర్పుతో శ్రీనివాస్‌ను తిరిగి పొందలేను. కానీ, విద్వేషపూరిత నేరాలకు పాల్పడే వారికి ఇది ఒక హెచ్చరిక’ అని పేర్కొన్నారు. మే 4వ తేదీన కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top