భారత్‌కు తోడుగా ఉంటాం: అమెరికా

US Backs India Move Over New Anti Terror Law - Sakshi

వాషింగ్టన్‌ : అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం, జైషే మహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ మహమ్మద్‌ సయీద్, ముంబై ఉగ్రవాద దాడుల నిందితుడు జకీ ఉర్‌ రెహ్మాన్‌ లఖ్వీలను వ్యక్తిగత హోదాలో ఉగ్రవాదులుగా ప్రకటించిన భారత ప్రభుత్వ నిర్ణయాన్ని అగ్రరాజ్యం అమెరికా సమర్థించింది. ఉగ్రవాదాన్ని రూపుమాపడంలో భారత్‌కు అమెరికా ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు...‘ నలుగురు ఉగ్రవాదులు మౌలానా మసూత్‌ అజర్‌, హఫీజ్‌ సయీద్‌, జకీ ఉర్‌ రెహ్మాన్‌, దావూద్‌ ఇబ్రహీంలను ఉగ్రవాదులుగా గుర్తిస్తూ ఇండియా తీసుకున్న నిర్ణయానికి మద్దతు పలుకుతున్నాం. భారత్‌- అమెరికా కలిసి ఉగ్రవాదులను ఏరివేయడానికి ఈ కొత్త చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాం’ అని అమెరికా దక్షిణ, మధ్య ఆసియా దేశాల వ్యవహారాల బ్యూరో ట్వీట్‌ చేసింది.

కాగా చట్టవ్యతిరేక కార్యకలాపాల (నియంత్రణ) సవరణ చట్టం(యూఏపీఏ)-1967కు కీలక సవరణలకు పార్లమెంటు ఆమోదం తెలిపిన నెలలోపే.. దావూద్‌, మసూద్‌, సయీద్‌, లఖ్వీలను కొత్త చట్టం కింద ఉగ్రవాదులుగా ప్రకటించినట్లు భారత కేంద్ర హోంశాఖ వెల్లడించిన విషయం విదితమే. ఇప్పటివరకు యూఏపీఏ కింద చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన సంస్థలనే ఉగ్రవాదులుగా ప్రకటించేవారు. కానీ కొత్తగా అమల్లోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం వ్యక్తుల్ని సైతం ఉగ్రవాదులుగా ప్రకటించే వెసులుబాటు ఉంది. ఇక ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఇప్పటికే ఈ నలుగురిపై అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ముద్రవేసి వారిపై రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

మౌలానా మసూద్‌ అజార్‌ (జైషే మహమ్మద్‌ చీఫ్‌): 
ప్రమేయం ఉన్న దాడులు

  • 2001లో జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీపై దాడులు
  • 2001లో పార్లమెంటుపై దాడి
  • 2016లో పఠాన్‌కోట వైమానిక స్థావరంపై దాడి
  • 2017లో శ్రీనగర్‌లో సరిహద్దు భద్రతా శిబిరంపై దాడి
  • ఈ ఏడాది ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రయాణించే బస్సుపై దాడి

హఫీజ్‌ మహమ్మద్‌ సయీద్‌ (లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు) :
ప్రమేయం ఉన్న దాడులు

  • 2000 సంవత్సరంలో ఎర్రకోట సహా వివిధ ప్రాంతాల్లో దాడులు
  • అదే ఏడాది యూపీలో రాం పూర్‌లో సీఆర్‌పీఎఫ్‌ శిబిరంపై దాడి
  • భారత్‌పై జరిగిన దాడుల్లో అత్యంత హేయమైనది 2008 ముంబై దాడులు
  • 2015లో కశ్మీర్‌ ఉధంపూర్‌లో సరిహద్దు భద్రతా దళం కాన్వాయ్‌పై దాడి

జకీ ఉర్‌ రెహ్మాన్‌ లఖ్వీ (లష్కరే తోయిబా కమాండర్‌):
ప్రమేయం ఉన్న దాడులు

  • 2000లో ఎర్రకోటపై దాడి
  • 2008 ముంబై దాడులు
  • రాంపూర్‌ సీఆర్‌పీఎఫ్‌ శిబిరంపై దాడులు
  • జమ్మూ కశ్మీర్‌ ఉధంపూర్‌లో సరిహద్దు భద్రతా దళంపై దాడులు
  • లఖ్వీని ఐక్యరాజ్యసమితి 2008లో అంతర్జాతీయ ఉగ్రవాది ప్రకటించింది

దావూద్‌ ఇబ్రహీం(అండర్‌ వరల్డ్‌ డాన్‌  )
పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్న అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం భారత్‌పై దాడులకి ఎన్నో కుట్రలు కుతంత్రాలు పన్నాడు. ఆర్థిక  సాయాన్ని అందించాడు తన అనుచరులతో కలిసి దాడులకు వ్యూహరచన చేశాడు. అల్‌ఖైదా, తాలిబన్ల కార్యకలాపాలకు మద్దతుగా ఉన్నాడు. 257 మంది నిండు ప్రాణాలను పొట్టనపెట్టుకున్న 1993లో ముంబైలో వరుస బాంబు పేలుళ్లు దావూద్‌ అనుచరుల పనే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top