అమెరికా తహతహ

Sakshi Editorial On America Responsibility On Terrorism

గత రెండు దశాబ్దాలుగా సెప్టెంబర్‌ దగ్గర పడుతున్నదంటే అమెరికా పట్టరాని ఆగ్రహంతో ఊగిపోయేది. ఎవరూ అడగకపోయినా ప్రపంచంలో ఉగ్రవాదాన్ని అంతమొందించే బాధ్యతను స్వీకరించిన అమెరికా... ఆ పేరుతో చాలా తరచుగా అఫ్ఘానిస్తాన్, ఇరాక్, సోమాలియా, లిబియా తదితర చోట్ల వైమానిక దాడులు చేసేది. వాటిల్లో ఉగ్రవాదులకన్నా సాధారణ పౌరులే అధిక సంఖ్యలో మరణించేవారు. కానీ ఇప్పుడు అంతా మారింది. వచ్చే సెప్టెంబర్‌ నాటికల్లా అఫ్ఘానిస్తాన్‌ ‘పీడ’ను వదుల్చుకోవటం ఎలాగన్నదే దాని ప్రస్తుత సమస్య. అందుకోసం అక్కడ శాంతి ‘స్థాపించడానికి’ తహతహలాడుతోంది. శాంతి సాధన మెచ్చదగిందే. కానీ అందుకు సహేతుకమైన ప్రాతిపదికలను ఏర్పర్చటం కీలకం. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ వేదికలను వినియోగించటం, అఫ్ఘానిస్తాన్‌లో అన్ని వర్గాలనూ ఒక తాటిపైకి తీసుకురావటం, సమస్యతో సంబంధం వున్న అన్ని దేశా లనూ అందులో భాగస్వాముల్ని చేసి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని అన్వేషించటం ప్రధానం. ఈ ప్రక్రియ ఒక కొలిక్కిరావటానికి కొంత సమయం పట్టే మాట వాస్తవమే అయినా... అది శాశ్వత శాంతికి దోహదపడుతుంది. సమస్యకు మూలకారణమైన తాలిబన్‌లకు సైతం ఇన్నా ళ్లుగా తాము అనుసరిస్తూ వచ్చిన మార్గం సరైందికాదన్న గ్రహింపు కలుగుతుంది. వారిలో అటు వంటి పునరాలోచన కలగవలసిన అవసరం వున్నదన్న సంగతిని కూడా అమెరికా గుర్తిస్తున్నట్టు లేదు. ఎలాగోలా అఫ్ఘాన్‌లో తమ దుకాణం కట్టేసి, సైనికులందరినీ వెనక్కి పిలిపించి ప్రశాంతంగా మనుగడ సాగిద్దా మన్న ఆత్రుతే దాని చర్యల్లో కనబడుతోంది. గత నెల 1న ఆ దేశం నుంచి సైనిక దళాల ఉపసంహ రణ ప్రక్రియ మొదలైంది. దోహాలో నిరుడు ఫిబ్రవరిలో తాలిబన్‌లతో అమెరికా కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా 2001లో అమెరికాపై ఉగ్రవాద దాడి జరిగిన రోజైన సెప్టెంబర్‌ 11వ తేదీకల్లా దళాల ఉపసంహరణ పూర్తికావాలని అది కోరుకుంటున్నది. ఇందులో భాగంగానే ఈ శుక్రవారం అఫ్ఘానిస్తాన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ, ఆ దేశ జాతీయ సమన్వయ మండలి చైర్మన్‌ అబ్దుల్లా అబ్దుల్లా తదితరులతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సమావేశం కాబోతు న్నారు. ఈ సందర్భంగా వైట్‌హౌస్‌ విడుదల చేసిన ప్రకటన ఘనంగానే వుంది. అఫ్ఘాన్‌ ప్రజానీ కాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని, వారికి కావలసిన మానవీయ సహాయసహకారాలు అందజేస్తా మని, దౌత్యపరంగా అండగా వుంటామని ఆ ప్రకటన తెలిపింది. అక్కడి మహిళలు, పిల్లలు, మైనా రిటీల హక్కులకు భంగం వాటిల్లనీయబోమని అభయం ఇచ్చింది. కానీ దురదృష్టమేమంటే జరుగు తున్న పరిణామాలు అందుకు తగినట్టు లేవు. అమెరికా దళాల తోడ్పాటు లేదు కనుక అఫ్ఘానిస్తాన్‌ జాతీయ భద్రతా బలగాలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నాయి. అన్నిచోట్లా యథేచ్ఛగా హింస కొనసాగుతోంది. తాలిబన్‌లు 40 శాతం జిల్లాలను తమ చెప్పుచేతల్లోకి తీసుకున్నారు. జనం తమ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ఉగ్రవాద సంస్థ అల్‌ కాయిదా నిక్షేపంగా వున్నదని, తాలిబన్‌లతో దాని స్నేహం చెక్కుచెదరలేదని అమెరికా ఇంటెలిజెన్స్‌ తాజా నివేదిక తేట తెల్లం చేస్తోంది. 

మరోపక్క తాలిబన్‌లతో అమెరికాకు పీటముడి వేయడంలో కీలకపాత్ర పోషించిన పాకిస్తాన్‌ అఫ్ఘాన్‌లో ఇప్పుడు చాలా చురుగ్గా పనిచేస్తోంది. తాలిబన్‌లను బుజ్జగించే పేరిట, వారిని ఒప్పించే పేరిట తన సైనికాధికారులను అక్కడికి తరలించి హవా నడిపిస్తోంది. సహజంగానే ఇది మన దేశానికి ఇబ్బంది కలిగించే పరిణామం. తాలిబన్‌లతో చర్చించటానికి, వారితో అవగాహన కుదు ర్చుకోవటానికి మొదట్లో ససేమిరా అన్న మన దేశం ఆ వైఖరిని సడలించుకున్నది. భారత ప్రతినిధి బృందం దోహాలో తాలిబన్‌లతో చర్చలు జరుపుతున్నదని ఈ నెల మొదటివారంలో వచ్చిన కథనా లను కతార్‌ తాజాగా ధ్రువీకరించింది. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. అఫ్ఘానిస్తాన్‌లో అమెరికా చేష్టల పర్యవసానంగా ఏ దేశానికైనా అంతకన్నా గత్యంతరం లేదు. ఆ దేశంలో గత కొన్నేళ్లుగా భారత్‌ అనేకానేక అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టింది. అక్కడి పౌరులకు వృత్తిపరమైన శిక్షణ నిచ్చి, వారి ఉన్నతికి దోహదపడింది. దేశంలో మహిళలతోసహా అన్ని వర్గాల హక్కులనూ పరి రక్షిస్తామని చెబు తున్న తాలిబన్‌లు దీన్నంతటిని విస్మరిస్తే వారికే నష్టం కలగజేస్తుంది. గతంలో కొన్నేళ్లపాటు అఫ్ఘాన్‌లో అధికారం గుప్పెట్లో పెట్టుకుని తాలిబన్‌లు సాగించిన అరాచకాలు గానీ, ప్రస్తుత పరిణా మాలుగానీ వారిని విశ్వసించటానికి అవరోధంగా వుంటున్నాయి. తాము నికార్సయిన ఇస్లామిక్‌ వ్యవస్థను ఏర్పరుస్తామని, మహిళలతోసహా అందరి హక్కులనూ కాపాడతామని తాజాగా తాలి బన్‌లు ప్రకటించారు. కానీ గతంలో తమవైపుగా ఫలానా లోపాలు చోటుచేసుకున్నాయని, అప్పట్లో తాము అనుసరించిన విధానాలు ఇస్లామిక్‌ వ్యతిరేకమైనవని వారు ఇంత వరకూ ప్రకటించలేదు. కనుకనే వారు చెబుతున్న ‘నికార్సయిన’ ఇస్లామిక్‌ వ్యవస్థ ఏమిటో, దాన్నెంత వరకూ విశ్వసించ వచ్చునో ఎవరికీ బోధపడటం లేదు. మొత్తానికి అమెరికా తొందర పాటు చర్యలు అఫ్ఘానిస్తాన్‌ను ప్రమాదంలోకి నెడుతున్నాయి. అది స్పష్టంగా తెలుస్తూనే ఉన్నా తెలియనట్టు నటిస్తోంది. ఇరవై య్యేళ్లక్రితం ‘ఉగ్రవాదంపై యుద్ధం’ పేరిట ప్రారంభించిన మతి మాలిన యుద్ధం ఎంత తప్పో... ఇప్పుడు అన్నిటినీ బేఖాతరు చేసి చేతులు దులుపుకొని పోవాలని చూడటం కూడా అంతే తప్పు. కానీ ఈ తప్పులకు మూల్యం చెల్లించేది అమెరికా కాదు... అఫ్ఘాన్‌ ప్రజానీకం. అది బాధాకరం. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top