ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు

US Agrees To India, 7 Nations Buying Iran Oil Despite Sanctions - Sakshi

ఇంధన కొనుగోలుకు భారత్, చైనా సహా 8 దేశాలకు మినహాయింపు

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా ఇరాన్‌పై కొరడా ఝులిపించింది. ఇరాన్‌ బ్యాంకింగ్, ఇంధన రంగాలు లక్ష్యంగా చరిత్రలోనే అత్యంత కఠినమైన ఆంక్షలను సోమవారం విధించింది. ఇరాన్‌కు చెందిన 600 కంపెనీలు, వ్యక్తులతో సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని ప్రపంచదేశాలకు స్పష్టం చేసింది. వీరితో వ్యాపార లావాదేవీలు నడిపే సంస్థలు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామనీ, భారీ జరిమానాలు విధిస్తామని తేల్చిచెప్పింది.

అయితే ఇరాన్‌ నుంచి భారీగా ఇంధనం కొనుగోలు చేస్తున్న చైనా, భారత్, టర్కీ, జపాన్, ఇటలీ సహా 8 దేశాలకు ఈ సందర్భంగా స్వల్ప మినహాయింపు ఇచ్చింది. ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులను 6 నెలల్లోగా పూర్తిస్థాయిలో నిలిపివేయాలని సూచించింది. ఈ విషయమై అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో మాట్లాడుతూ.. ‘సైబర్‌ దాడులు, క్షిపణి పరీక్షలు, మధ్యప్రాచ్యంలో ఉగ్రవాదానికి అండగా నిలుస్తున్న ఇరాన్‌ ప్రభుత్వాన్ని దారిలోకి తెచ్చేందుకే ఈ ఆంక్షలను విధించాం. ఈ జాబితాలో ఇరాన్‌కు సంబంధించి 600 కంపెనీలు, వ్యక్తులు ఉన్నారు.

చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో మార్కెట్‌లో ముడిచమురు సరఫరాను నియంత్రించగలిగాం. అయినా అమెరికన్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం’ అని తెలిపారు. అయితే అమెరికా నుంచి మినహాయింపు పొందిన దేశాల్లో భారత్, చైనాలు ఉన్నాయా? అని ప్రశ్నకు పాంపియో సమాధానం దాటవేశారు. మరోవైపు అమెరికా ఆంక్షలను అవలీలగా అధిగమిస్తామని ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ వ్యాఖ్యానించారు. 2015లో ఇరాన్‌తో రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ దేశాల సమక్షంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా చేసుకున్న అణు ఒప్పందాన్ని మే నెలలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రద్దుచేశారు. కొత్త ఒప్పందం కోసం చర్చలకు రావాలంటూ గతంలో ఉన్న ఆంక్షలను పునరుద్ధరించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top