గృహహింసకు ముగింపు పలకండి:యూఎన్‌ చీఫ్‌

UN Chief Urges End To Domestic Violence Amid Covid 19 Lockdown - Sakshi

న్యూయార్క్‌: మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికై ప్రపంచ దేశాలు పోరాటం ఉధృతం చేసిన వేళ గృహహింస కేసుల సంఖ్యలో పెరుగుదల ఆందోళనకరంగా పరిణమించిందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ అన్నారు. అత్యంత సురక్షితంగా భావించే సొంత ఇంటిలోనే మహిళలు హింసకు గురవడం.. బాధాకర విషయం అని విచారం వ్యక్తం చేశారు. కరోనా ధాటికి ప్రపంచమంతా అల్లాడుతున్న వేళ ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం గర్హనీయమన్నారు. గత కొన్నివారాలుగా గృహ హింస కేసుల్లో భయంకరమైన పెరుగుదల నమోదైందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభంలో హెల్‌‍్పలైన్‌ నంబర్లను ఆశ్రయిస్తున్న మహిళల సంఖ్య రెట్టింపు అయిందన్నారు. హింసను అంతం చేసి ప్రతీ ఒక్కరు తమ ఇంటిలో శాంతి స్థాపన చేయాలని విజ్ఞప్తి చేశారు.(లాక్‌డౌన్‌: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు!)

అదే విధంగా కొన్ని దేశాల్లో కరోనాపై పోరుకు తగినంతగా వైద్య సిబ్బంది అందుబాటులో లేరని.. ఈ విషయంపై ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని గుటెరస్‌ సూచించారు. అంతేగాకుండా కోవిడ్‌-19పై పోరాడటంతో పాటుగా మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టడం కూడా ముఖ్యమైన బాధ్యతగా గుర్తించాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. కరోనాపై యుద్ధంతో పాటుగా.. గృహ హింసకు వ్యతిరేకంగా ప్రతీ ఒక్కరూ కలిసికట్టుగా పోరాటం చేయాలన్నారు. కాగా మానవాళికి ముప్పుగా పరిణమించిన కోవిడ్‌-19ను అంతం చేసే చర్యల్లో భాగంగా వివిధ దేశాల్లో లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా సహా భారత్‌, చైనా, యూరప్‌ దేశాలు ఇటలీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌లలో గృహ హింస కేసుల సంఖ్య రెట్టింపు అయిందని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. (గృహ హింసకు ఎర్ర చుక్క పరిష్కారం)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top