కరోనా అంతానికి అదొక్కటే మార్గం: యూఎన్‌ చీఫ్‌

UN Chief Says Only Covid 19 Vaccine Will Allow Return To Normalcy - Sakshi

న్యూయార్క్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌(కోవిడ్‌-19)నివారణకు వ్యాక్సిన్‌ కనుగొన్నప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది చివరి నాటికి కరోనాను అంతం చేసే వ్యాక్సిన్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితిలో సభ్య దేశాలైన పలు ఆఫ్రికా దేశాల ప్రతినిధులతో బుధవారం ఆయన వీడియో కాన్షరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా గుటెరస్‌ మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా అందరినీ సంఘటితం చేస్తూ.. వ్యాక్సిన్‌ కనుగొనే పరిశోధనలను వేగవంతం చేసేలా ప్రోత్సహించినపుడే మహమ్మారిని నియంత్రించగలిగే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. అందుకోసం 2020 ఏడాది ముగిసే నాటికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవశ్యకత ఉందన్నారు. (అమెరికా నిర్ణయం ఆందోళనకరం: చైనా)

అదే విధంగా... ‘‘సురక్షితమైన, ప్రభావంతమైన వ్యాక్సిన్‌ మాత్రమే ప్రస్తుత పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురాగలిగే ఏకైక సాధనం. అదే లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతుంది. ట్రిలియన్‌ డాలర్ల ఖర్చును కట్టడి చేస్తుంది’’అని ఆంటోనియో పేర్కొన్నారు. కరోనా సంక్షోభ సమయంలో టాక్స్‌ రిటన్స్‌ దాఖలు చేసేందుకు గడువు పొడిగించిన ఉగాండా.... ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయిన వారిని ఆర్థికంగా ఆదుకుంటున్న నమీబియా.... ప్రజలకు ఆహార ధాన్యాలు అందిస్తున్న కేప్‌ వెర్డే.... పరిశ్రమలకు పన్ను భారం తగ్గించిన ఈజిప్టు ప్రభుత్వాలను ఆయన ఈ సందర్బంగా ప్రశంసించారు. కాగా ఐరాస అనుబంధమైన ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిధులు నిలిపివేయడంపై ఆంటోనియో గుటెరస్‌ విచారం వ్యక్తం చేసిన విషయం విదితమే. ట్రంప్‌ ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదన్న ఆయన.. విపత్కర పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం పరస్పర సహకారంతో ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు.(ఉగ్ర ప్రమాదం పొంచి ఉంది: యూఎన్‌ చీఫ్‌ హెచ్చరికలు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top