‘బ్రెగ్జిట్‌’కు బ్రిటన్‌ పార్లమెంట్‌ ఓకే

UK parliament approves Brexit withdrawal deal - Sakshi

బిల్లుకు అనుకూలంగా 330 ఓట్లు

వ్యతిరేకంగా 231 ఓట్లు

31న ఈయూ నుంచి విడిపోతున్న బ్రిటన్‌

లండన్‌: యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ విడిపోయే బ్రెగ్జిట్‌ ఒప్పందానికి బ్రిటన్‌ పార్లమెంటు ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. హౌజ్‌ ఆఫ్‌ కామన్స్‌లో గురువారం జరిగిన ఓటింగ్‌లో బ్రెగ్జిట్‌ బిల్లుకు అనుకూలంగా 330 ఓట్లు, వ్యతిరేకంగా 231 ఓట్లు వచ్చాయి.  విపక్ష లేబర్‌ పార్టీ బ్రెగ్జిట్‌ను వ్యతిరేకిస్తూ ఓటేసింది. తాజా ఓటింగ్‌తో బ్రెగ్జిట్‌పై సంవత్సరాలుగా కొనసాగిన ఉత్కంఠ, రాజకీయ డ్రామా, అనుకూల, ప్రతికూలతలపై చర్చోపచర్చలు.. అన్నింటికీ కొంతవరకు తెరపడింది. ‘జనవరి 31న  ఈయూ నుంచి విడిపోబోతున్నాం. ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఇచ్చిన హామీ నెరవేరబోతోంది’ అని జాన్సన్‌ ప్రభుత్వ అధికార ప్రతినిధి ప్రకటించారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో బోరిస్‌ జాన్సన్‌ నేతృత్వంలోని కన్సర్వేటివ్‌ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రావడంతో పార్లమెంట్లో బ్రెగ్జిట్‌ బిల్లు సునాయాసంగా గట్టెక్కింది. గత 50 ఏళ్లుగా ప్రధాన వాణిజ్య భాగస్వామిగా  ఉన్న ఈయూ నుంచి బ్రిటన్‌ వేరుపడనుంది. ఈయూ నుంచి వేరుపడ్తున్న తొలి దేశంగా బ్రిటన్‌ నిలవనుంది. బ్రెగ్జిట్‌పై తొలి నుంచి వాదోపవాదాలు కొనసాగాయి. ఈయూ నుంచి విడిపోతే బ్రిటన్‌ సామాన్య దేశంగా మిగిలిపోతుందని, వాణిజ్యపరంగా నష్టపోతుందని పలువురు వాదించగా.. బ్రెగ్జిట్‌తో బ్రిటన్‌కు లాభమేనని, గతవైభవం సాధించేందుకు ఇదే మార్గమని మరి కొందరు వాదించారు. ఇక బ్రెగ్జిట్‌ బిల్లు హౌజ్‌ ఆఫ్‌ లార్డ్స్, యూరోపియన్‌ పార్లమెంట్‌ ఆమోదం పొందాల్సి ఉంది. అయితే, అది లాంఛనమేనని భావిస్తున్నారు.   

పార్లమెంట్‌లో ప్రధాని జాన్సన్‌ (మధ్యలో)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top