
‘ఉత్తర కొరియా సమస్య ముగిస్తా.. బెట్ కాస్కోండి’
ఉత్తర కొరియా ఒక ప్రపంచ సమస్య అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు.
రోమ్: ఉత్తర కొరియా ఒక ప్రపంచ సమస్య అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన జపాన్ ప్రధాని షింజో అబేను కలిసి పలు విషయాలు మాట్లాడారు. ఇటలీలో జీ7 శిఖరాగ్ర సమావేశం జరుగడానికి ముందే ఆయన షింజోను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
‘ఇది చాలా పెద్ద సమస్య.. ప్రపంచ సమస్య.. త్వరలోనే పరిష్కారం అవుతుంది. ఏదో ఒక చోట అది కచ్చితంగా పరిష్కారం జరుగుతుంది.. కావాలంటే మీరు దీనిపై పందెం కాయొచ్చు’ అని ట్రంప్ అన్నారు. ఇప్పటికే ఉత్తర కొరియా, అమెరికా మధ్య ఉద్రిక్తపూరిత పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. అమెరికాకు చెందిన రెండు యుద్ధ నౌకలు ఇప్పటికే ఉత్తర కొరియా సముద్ర జలాలకు సమీపంలో మోహరించి ఉంచారు. అయితే, తాను మధ్యే మార్గంగా సమస్యకు పరిష్కారం కావాలని కోరుకుంటున్నానని, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్యవర్తిత్వంతో అది సాధించాలని భావిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈలోగా తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.