పాకిస్తాన్‌కు సాయం నిలిపేస్తాం: ట్రంప్‌

Trump Alleges Pakistan Govt Is Not Helping America To Eliminate Terrorism - Sakshi

26/11 బాధితులకు అండగా ఉంటాం : అమెరికా

వాషింగ్టన్‌ : పదేళ్ల క్రితం ముంబైలో జరిగిన ఉగ్రదాడి బాధితులకు న్యాయం జరగాలని పోరాడుతోన్న భారతదేశానికి తాము అండగా ఉంటామని అమెరికా ప్రకటించింది. ముంబైలో 26/11 ఉగ్రదాడి జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మంగళవారం ట్విటర్‌ వేదికగా స్పందించారు.

‘ఉగ్ర దాడులు జరిగి పదేళ్లు పూర్తయ్యాయి. ఈ ఘటనలో ఆరుగురు అమెరికన్లు సహా 166 మంది మృతిచెందారు. బాధితుల పక్షాన పోరాడుతోన్న భారత్‌కు తోడుగా ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదాన్ని గెలవనీయం. కనీసం గెలుపు దగ్గరికి కూడా వారిని రానీయం’అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. ‘తీవ్రవాదాన్ని అంతమొందించడంలో పాక్‌ మాకు సహకరించడం లేదు. అందుకే ఇక నుంచి పాకిస్తాన్‌కు ఏటా ఇస్తున్న రూ. 9,201 కోట్ల  మొత్తాన్ని ఇకపై ఇవ్వబోము’ అని పేర్కొన్నారు. ఇక.. 26/11 ఉగ్రదాడి సూత్రధారుల గురించి గానీ, దాడులకు ప్రేరేపించిన వారి గురించి గానీ సమాచారం తెలియజేస్తే వారికి 5 మిలియన్‌ డాలర్లు(దాదాపు 35 కోట్ల రూపాయలు) రివార్డు అందజేస్తామని అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే.

కాగా గతేడాది ఆగస్ట్‌లో.. ట్రంప్‌ దక్షిణాసియా విధానం వెల్లడించిన అనంతరం అమెరికా, పాక్‌ల మధ్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పాకిస్తాన్‌కు అందిస్తున్న భారీ సైనిక సాయాన్ని నిలిపివేయాలని కూడా ట్రంప్‌ నిర్ణయించారు. పాక్‌ ప్రభుత్వం తమ భూభాగంలో ఉగ్ర సంస్థ అల్‌ఖైదా నేత ఒసామా బిన్‌ లాడెన్‌కు ఆవాసం కల్పించిందని ఆరోపించారు. ఇందులో తాను కొత్తగా చెబుతోంది ఏమీ లేదని, ఈ విషయాలన్నీ బహిరంగ రహస్యమేనని గత వారం ఫాక్స్‌ న్యూస్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top