ఘోరకలి.. ఉరి తీసేశారు

Tokyo Deadly Sarin Attack Aum Shinrikyo Aides Hanged - Sakshi

టోక్యో: జపాన్‌ చరిత్రలో ఘోర కలిగా ముద్ర పడిపోయిన ‘టోక్యో సరిన్‌ దాడి’ నిందితులందరికీ ఉరిశిక్ష అమలైంది. రెండు దశాబ్దాల క్రితం ఓమ్‌ షిన్రిక్యో మత అనుచరులు రసాయనిక దాడులకు పాల్పడి 13 మందిని పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఆరుగురికి గురువారం ఉదయం ఉరిశిక్ష అమలు చేసేశారు. ఈ దారుణ ఘటన ప్రధాన సూత్రధారి, ఓమ్‌ షిన్రిక్యో (Aum Shinrikyo) వర్గ గురువు ‘షోకో అసహారా’ను, మరో ఆరుగురు నిందితులను ఏ నెల మొదట్లో ఉరి తీసిన విషయం విదితమే.  
 
సరిన్‌ దాడి: 1984 షోకో అసహారా(అంధుడు).. ఓమ్‌ షిన్రిక్యో అనే మతాన్ని నెలకొల్పి వేల సంఖ్యలో అనుచరులను తయారు చేసుకున్నాడు. ప్రపంచం అంతమైపోతుందన్న షోకో ప్రవచనల ప్రేరణతో..  ఓమ్‌ షిన్రిక్యో అనుచర గణం మారణ హోమానికి యత్నించింది. 1995 మార్చిలో టోక్యోలోని 'సబ్‌వే'లో ఆరు రైళ్లలో ఒకేసారి రసాయనిక దాడులకు పాల్పడింది. అత్యంత విషపూరిత 'సరిన్‌' వాయువును వదలటంతో 13 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 6 వేల మంది క్షతగాత్రులయ్యారు. అప్పట్లో ఈ దాడులు సంచలనంగా మారాయి. అసహారా ఆదేశాల మేరకు అతడి అనుచరులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తేలటంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మౌంట్‌ ఫుజీలోని షోకో ప్రధానాశ్రమం మీద దాడి చేసి ఆస్తులను ధ్వంసం చేశారు.

ఆపై విదేశాలకు పారిపోతున్న షోకో, అతని అనుచరులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అంతేకాదు షోకో మరియు ఆయన అనుచరులు ‘సరిన్‌ విషప్రయోగం’ ద్వారానే ఓ లాయర్‌ కుటుంబాన్ని హతమార్చారన్న ఆరోపణలు కూడా రుజువయ్యాయి. దీంతో ఆయా కేసుల్లో దోషులుగా తేలటంతో అసహారా, అతని అనుచరులకు ఉరిశిక్ష విధిస్తూ 2004లో కోర్టు తీర్పునిచ్చింది. మరణ శిక్ష రద్దుపై జపాన్‌లో మిమాంస కొనసాగుతున్న తరుణంలో.. దోషులకు శిక్ష అమలు ఇన్నేళ్లు వాయిదా పడుతూ వస్తోంది. చివరకు ‘సరిన్‌ దాడి బాధిత కుటుంబాల’ ఒత్తిడి మేరకు ప్రభుత్వం.. వారికి శిక్ష అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నెల మొదట్లో(జూలై6) అసహారా సహా ఏడుగురు సభ్యులకు మరణశిక్ష అమలు చేసినట్లు జపాన్‌ న్యాయశాఖ అధికారి వెల్లడించారు. ఇప్పుడు మిగిలిన ఆరుగురికి శిక్ష అమలు చేయటంతో ఈ కేసులో నిందితులందరినీ ఉరి తీసినట్లయ్యింది.

అతిపెద్ద విషాదం.. 900 మంది సూసైడ్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top