అంతరిక్షం అంచున.. అంతిమ సంస్కారం! | Sakshi
Sakshi News home page

అంతరిక్షం అంచున.. అంతిమ సంస్కారం!

Published Tue, Dec 16 2014 2:32 AM

The funeral of the edge of space ..!

చనిపోయాక కొందరిని దహనం చేస్తారు. మరికొందరిని సమాధి చేస్తారు. ఒకవేళ ద హనం చేస్తే.. అస్థికలను గంగలో కలిపి చనిపోయినవారి ఆత్మకు శాంతి, మోక్షం చేకూరాలని కోరుకుంటారు. అయితే, మన ఆప్తులకు అంతరిక్షం అంచున కూడా అంతిమ సంస్కారం చేయొచ్చంటున్నారు అమెరికాలోని కెంటకీకి చెందిన ‘మీసోలోఫ్ట్’ కంపెనీవారు.

మీరు ఓకే అంటే.. మీ ఆప్తుల చితాభస్మాన్ని కంటెయినర్‌లో ఉంచి ప్రత్యేక వెదర్ బెలూన్‌కు కట్టి వీరు అంతరిక్షం అంచుకు సుమారుగా 23 కిలోమీటర్ల ఎత్తుకు పంపిస్తారు. అక్కడికెళ్లగానే చితాభస్మం ఉన్న కంటెయినర్ తెరుచుకుంటుంది. చితాభస్మం బయటికి వస్తుంది. అయితే.. అది అప్పటికప్పుడే నేలపై పడిపోదు. కొన్ని నెలలపాటు భూమి చుట్టూ ధూళికణాల రూపంలో తిరుగుతూ క్రమంగా కిందికి వస్తుంది.

చివరికి వర్షపు చినుకుల్లోనో, మంచు బిందువుల్లోనో కలిసిపోయి నేలకు చేరుతుంది. ఆకాశంలో చితాభస్మం జారవిడిచేటప్పుడు బెలూన్‌కు ఉండే కెమెరాలతో ఫొటోలు, వీడియోలు కూడా వీరు తీసిస్తారు. ప్యాకేజీని బట్టి ఈ అంతిమ సంస్కారానికి రూ. 17 లక్షల నుంచి రూ. 47 లక్షల వరకూ ఖర్చవుతుందట.
 

Advertisement
Advertisement