గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌ రేసులో స్వరూప్‌ రావల్‌  | Sakshi
Sakshi News home page

గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌ రేసులో స్వరూప్‌ రావల్‌ 

Published Fri, Feb 22 2019 1:23 AM

Swarup Rawal in the Global Teacher Prize race - Sakshi

లండన్‌: భారత్‌కు చెందిన నటి, ఉపాధ్యాయురాలు స్వరూప్‌ రావల్‌ వర్కీ ఫౌండేషన్‌ గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌ రేసులో టాప్‌ 10 ఫైనలిస్టులో స్థానం సంపాదించారు. బోధనలో వినూత్న పద్ధతులు అవలంభించడం ద్వారా భారతీయ సమాజంలోని పిల్లలలో నైపుణ్యాభివృద్ధిని పెంచేందుకు చేసిన కృషికి గాను ఆమె పేరు జాబితాలో చేర్చారు. స్వరూప్‌ ప్రస్తుతం గుజరాత్‌లోని లావడ్‌ ప్రైమరీ పాఠశాలలో పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 179 దేశాల నుంచి వచ్చిన దాదాపు 10 వేల నామినేషన్ల నుంచి ఆమె పేరు ఎంపిక కావడం విశేషం. వచ్చే నెల దుబాయ్‌లో గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్కిల్స్‌ ఫోరమ్‌ (జీఈఎస్‌ఎఫ్‌) విజేతకు ఈ అవార్డును అందజేయనుంది. విజేతకు రూ.7 కోట్ల ప్రైజ్‌ మనీ అందజేస్తారు.

మాజీ మిస్‌ ఇండియా, ప్రముఖ నటుడు పరేష్‌ రావల్‌ సతీమణి కూడా అయిన స్వరూప్‌ రావల్‌ టాప్‌ 10 జాబితాలో చోటు దొరికినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ‘చాలా కొద్ది మంది మాత్రమే టీచర్ల ప్రతిభను, కష్టాన్ని గుర్తిస్తున్నారు. విద్యను బోధించడం నిజంగా సవాల్‌ లాంటిదే. ఈ ప్రయాణంలో ప్రతి విజయాన్ని వేడుకగా చేసుకోవాల్సిందే అని నేను నమ్ముతాను. నాతోపాటు అవార్డు రేసులో నిలిచిన వారికి, నిలవని వారికి నేను అభినందనలు తెలుపుతున్నాను’అని స్వరూప్‌ అన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement