80,886 మెట్రిక్ టన్నుల చమురుతో ముంద్రా పోర్ట్‌కు చేరుకున్న ట్యాంకర్
అహ్మదాబాద్/హాంకాంగ్: యుద్ధమయ హార్మూజ్ గుండా మరో ముడిచమురు రవాణా నౌక క్షేమంగా భారత నౌకాశ్రయానికి చేరుకుంది. భారతీయ జెండాతో ‘జగ్ లడ్కీ’నౌక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఫుజైరా పోర్ట్‌లో 80,886 మెట్రిక్ టన్నుల ముడిచమురు నింపుకుని హార్మూజ్ గుండా ప్రయాణించి బుధవారం గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌కు చేరుకుందని ఆ పోర్ట్ నిర్వహణ సంస్థ ‘అదానీ పోర్ట్స్’ప్రకటించింది.
ఇదే ఫుజైరా పోర్ట్‌పై ఇరాన్ ఇటీవల క్షిపణి దాడులు చేసింది. అయినాసరే పోర్ట్‌నుంచి సరకు ఎగుమతి నిరాటంకంగా కొనసాగుతోంది. సోమవారం హార్మూజ్ గుండా బయల్దేరి 46,500 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ సరకుతో ‘నందా దేవి’నౌక వచి్చన మరుసటి రోజే మరో సరకు రవాణా నౌక సురక్షితంగా భారత్‌కు రావడం విశేషం. 274.19 మీటర్ల పొడవుండే జగ్ లడ్కీ నౌక గరిష్టంగా 1,64,716 టన్నుల సామర్థ్యతో ప్రయాణించగలదు. భారత చమురు దిగుమతులకు సంబంధించి హార్మూజ్ జలసంధి అత్యంత కీలకం. దీని గుండానే భారత్‌కు దాదాపు 40–50 శాతం చమురు వస్తోంది.
హార్మూజ్‌ను దాటిన 89 నౌకలు
హార్మూజ్ గుండా సరకు రవాణా నౌకల రాకపోకలపై ఇరాన్ నిషేధం విధించినా సరే సిగ్నళ్లను నిలిపేసి, లైట్లను ఆర్పేసి ‘డార్క్ మోడ్’లో ఎవరి కంటా పడకుండా కొన్ని నౌకలు ఇదే మార్గం గుండా ప్రమాదకరరీతిలో ప్రయాణం కొనసాగిస్తున్నాయి. అయితే మిత్రదేశాలకు చెందిన నౌకలపై ఇరాన్ దాడులకు పాల్పడట్లేదని తెలుస్తోంది. భారత్, పాకిస్తాన్ జెండాతో ప్రయాణిస్తున్న నౌకలు సైతం సురక్షితంగానే ప్రయాణం పూర్తిచేస్తున్నాయి. యుద్ధం మొదలయ్యాక మార్చి ఒకటో తేదీ నుంచి మార్చి నెల 15వ తేదీదాకా 89 సరకు రవాణా నౌకలు హార్మూజ్ గుండా విజయవంతంగా ప్రయాణించాయని సముద్రమార్గ ప్రయాణాల డేటా సంస్థ ‘లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్’బుధవారం ప్రకటించింది. ఈ 89 నౌకల్లో ఐదింట ఒకవంతు నౌకలకు ఇరాన్‌తో సంబంధం ఉందని, చైనా, గ్రీస్ జెండాలున్న నౌకలూ సులభంగానే హార్మూజ్‌ను దాటేశాయని ‘లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్’పేర్కొంది.
చైనాకు బదులు భారత్‌కు బయల్దేరిన 7 నౌకలు
రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోళ్లపై అమెరికా తాత్కాలికంగా ఆంక్షల సడలింపు ప్రకటించిన నేపథ్యంలో మోదీ సర్కార్ మళ్లీ రష్యాచమురు కొనుగోళ్ల పర్వానికి తెరలేపింది. దీంతో రష్యా నుంచి చైనాకు బయల్దేరిన ఏడు ముడిచమురు రవాణా నౌకలు సముద్రమార్గం మధ్యలోనే దిశ మార్చుకుని భారత్‌కు ప్రయాణం మొదలెట్టడం విశేషం. జనవరి చివరివారంలో రష్యా నుంచి బయల్దేరి బాలి్టక్ సముద్రజలాల్లో ప్రయాణించిన మధ్యశ్రేణి ముడిచమురునౌక ‘ఆక్వా టైటాన్’వాస్తవానికి చైనాలోని రిజావో పోర్ట్‌కు వెళ్లాలి. కానీ అది ఇటీవల దిశ మార్చుకుని భారత్ దిశగా వెళ్తోందని, మార్చి 21వ తేదీకల్లా న్యూ మంగళూరు పోర్ట్‌లో లంగరు వేస్తుందని నౌకల ట్రాకింగ్ సంస్థ ‘ఓర్టెక్సా లిమిటెడ్’పేర్కొంది. ‘సూయిజ్‌మ్యాక్స్ జోయూజోయూ ఎన్’నౌక సైతం దిశ మార్చుకుని భారత్‌కు వస్తోందని మార్చి 25వ తేదీకల్లా గుజరాత్‌లోని జామ్‌నగర్ సిక్కా పోర్ట్‌కు చేరుకుంటుందని తెలిపింది.


