పాటలతో గిన్నిస్‌ బుక్కులోకి.. 

Suchetha Satish trying to sing a songs in 85 languages - Sakshi

85 భాషల్లో పాడనున్న భారత బాలిక 

దుబాయ్‌: అసమాన ప్రతిభకనబరిస్తేనే గిన్నిస్‌ బుక్‌లో చోటు దక్కుతుంది. అందుకే తన వయసు 12 ఏళ్లే అయినా.. ఏకంగా 85 భాషల్లో పాటలు పాడి, గిన్నిస్‌బుక్కులో చోటుదక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది సుచేతా సతీష్‌. దుబాయ్‌లోని ఇండియన్‌ హైస్కూల్లో ఏడోతరగతి చదువుతున్న భారతీయ బాలిక సుచేత డిసెంబరు 29న ఈ రికార్డుపాట పాడనుంది. ఇప్పటికే ఎనభై భాషలలో పాడడం నేర్చుకుందట. వీటిని నేర్చుకోవడానికి అమెకు  ఒక సంవత్సరం పట్టిందట. 

అయితే డిసెంబరు 29 నాటికి మరో ఐదు భాషల్లో పాడడం నేర్చుకొని, 85 భాషల్లో పాడాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేరళలోనే పుట్టిపెరిగిన సుచేతాకు హిందీ, మళయాలం , తమిళం వచ్చు. అంతేగాక స్కూల్లో జరిగే  పోటీల్లో ఇంగ్లిష్‌లో పాటలు పాడేదట. ఈ సందర్భంగా సుచేతా మాట్లాడుతూ... ‘నా మొదటి పాట జపాన్‌ భాషలోనిది. మా నాన్నగారి స్నేహితురాలు జపాన్‌కు చెందిన డెర్మాటాలజిస్ట్‌. రోజు నా స్కూల్‌ అయిపోయిన తర్వాత ఆమె మా ఇంటికి వచ్చేవారు. అప్పుడు నేను ఆమె దగ్గర జపనీస్‌ సాంగ్‌ నేర్చుకున్నాన’ని తెలిపింది. 

సాధారణంగా తనకు ఒక పాట నేర్చుకోవడానికి రెండు గంటల సమయం పడుతుందని, ఒక వేళ సులభంగా పలకగలిగితే దానిని అర్ధగంటలో నేర్చుకోగలనని చెబుతోంది. ప్రెంచ్, హంగేరియన్, జర్మన్‌ భాషలు తనకు బాగా కష్టంగా అనిపించాయని, అయినా ఆ భాషల్లో కూడా పాటలు పాడుతున్నానని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేశిరాజు శ్రీనివాస్‌ 2008లో 76 భాషలలో పాటలు పాడిన రికార్డుకు ఇప్పటిదాకా గిన్నిస్‌ బుక్కులో చోటుంది. ఆ రికార్డును చెరిపేసి, తనపేరిట సరికొత్త రికార్డును నెలకొల్పుతానని సుచేత నమ్మకంగా చెబుతోంది.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top