పుర్రె ఎముకలు పెరుగుతున్నాయి

Spikes In The Back Of Skulls Because Use Of Smartphones - Sakshi

స్మార్ట్‌ఫోన్లతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అంతేస్థాయిలో నష్టాలు ఉన్నాయని మనం తరచూ వింటుంటాం. సామాజిక సంబంధాలు తగ్గిపోతాయని.. అదేపనిగా టైప్‌ చేయడం వల్ల వేళ్లు, కీళ్ల నొప్పులు ఎక్కువవుతాయని చెబుతుంటారు. తాజాగా స్మార్ట్‌ఫోన్‌ అతి వాడకం పుణ్యమా అని మన పుర్రెల్లో కొన్ని ఎముకలు అవసరానికి మించి పెరుగుతున్నాయని ఆస్ట్రేలియాలోని సన్‌షైన్‌ కోస్ట్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఊరట కలిగించే విషయం ఏంటంటే దీంతో ఎలాంటి ఆరోగ్య సమస్యల్లేకపోవడం. ఒకప్పుడు ఇలాంటి ఎముక పెరుగుదల అరుదుగా.. లక్షల్లో కొందరికి జరుగుతాయని భావించినా.. స్మార్ట్‌ఫోన్ల పుణ్యమా అని ఇప్పుడు వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. పుర్రె వెనుక భాగంలో తాకితే తెలిసేంత సైజుకు ఎముకలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

తాము 18–30 ఏళ్ల మధ్య వయసున్న ఓ వెయ్యి మంది పుర్రెలను పరిశీలించిన తర్వాత తాము ఈ అంచనాకు వచ్చామని డాక్టర్‌ డేవిడ్‌ షహర్‌ అనే శాస్త్రవేత్త తెలిపారు. వైద్య వృత్తిలో 20 ఏళ్లుగా ఉన్న తాను గత పదేళ్ల నుంచి ఎముక పెరుగుదలకు సంబంధించిన కేసులను ఎక్కువగా చూస్తున్నట్లు డేవిడ్‌ తెలిపారు. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లను వాడేటప్పుడు మనం మెడను వంచి కిందకు చూస్తూ ఉండటం సమస్యకు మూలకారణమని.. సాధారణ పరిస్థితుల్లో అతితక్కువగా ఉపయోగించే కండరాలను తల వంచినప్పుడు వాడుతుండటంతో ఆ అదనపు బరువును తట్టుకునేందుకు, తల నిలకడగా ఉండేందుకు ఈ ఎముకల పెరుగుదల అవసరమవుతుందని చెప్పారు. మెడను, వెన్నును కలిపే కండరాలపై ఎక్కువ ఒత్తిడి పడకుండా ఉండేందుకు శరీర వ్యవస్థ ఎముకలు పెరిగేలా చేస్తుందని అంచనా. 

అంగుళం మేర పెరుగుదల.. 
ఈ అధ్యయనంలో కొంతమంది యువకుల ఎముకలు ఒక అంగుళం మేర పెరిగినట్లు తెలిసింది. 1996 నాటితో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. గతేడాది నీల్సన్‌ సంస్థ జరిపిన ఒక సర్వే ప్రకారం భారత్‌లో మొబైల్‌ఫోన్‌ సగటు వినియోగం రోజుకు 90 నిమిషాలు. బాగా ఖరీదైన ఫోన్లు వాడే వారైతే 2 గంటల 10 నిమిషాలు వాడుతున్నారు. బ్రిటన్‌లో ఇది రెట్టింపు కంటే ఎక్కువ. కచ్చితంగా చెప్పాలంటే రోజుకు మూడున్నర గంటల పాటు యువత స్మార్ట్‌ఫోన్లను వాడుతోంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top