గండం గట్టెక్కగానే చేయాల్సినవి ఇవే.. | South Korea Outlined Guidelines For A Two Year Return To A Post Coronavirus Normality | Sakshi
Sakshi News home page

మహమ్మారిని తరిమే మార్గదర్శకాలు..

Apr 24 2020 4:51 PM | Updated on Apr 24 2020 4:53 PM

South Korea Outlined Guidelines For A Two Year Return To A Post Coronavirus Normality - Sakshi

మహమ్మారి నియంత్రణకు దక్షిణ కొరియా మార్గదర్శకాల జారీ

సియోల్‌ : కరోనా మహమ్మారిని సమర్ధవంతంగా కట్టడి చేసిన దక్షిణ కొరియా ఈ వ్యాధి తీవ్రత కనుమరుగైన తర్వాత రెండేళ్ల వరకూ ఎలా వ్యవహరించాలనే కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. సుదీర్ఘ లాక్‌డౌన్‌ల కంటే పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించడం, రోగులు, అనుమానితులను క్వారంటైన్‌ చేయడం, ట్రాకింగ్‌ యాప్స్‌తో కాంటాక్ట్‌లను ట్రేస్‌ చేయడం ద్వారా కరోనా మహమ్మారిని దక్షిణ కొరియా కట్టడి చేయగలిగింది. వ్యాధిని అదుపుచేసిన క్రమంలో ఇక సాధారణ పరిస్థితులు నెలకొనేలా రెండేళ్ల పాటు అనుసరించాల్సిన మార్గదర్శకాలను దక్షిణ కొరియా ఖరారు చేసింది. సమూహాలకు దూరంగా ఉండటం, ఒంటరిగా ప్రయాణించడం, రెస్టారెంట్లలో భోజనాలను త్వరగా ముగించడం వంటి పలు సూచనలు పాటించాలని ప్రజలను కోరుతోంది.

కరోనా కేసులు గణనీయంగా పడిపోవడం, మరణాలను 240కే పరిమితం చేయడంతో రానున్న రోజుల్లో వరుసగా జీరో కేసులు నమోదవుతాయని దక్షిణ కొరియా భావిస్తోంది.  వైరస్‌ ప్రభావం రెండేళ్ల వరకూ ఉంటుందన్న అంచనాలతో కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లాలని నిర్ణయించామని ఆరోగ్య మంత్రి కిమ్‌ గాంగ్‌లిప్‌ చెప్పారు. సామాజిక, ఆర్థిక కార్యకలాపాలను కొనసాగిస్తూనే భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలతో కోవిడ్‌-19ను నిలువరించే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

చదవండి : వైరస్‌ వెంటాడుతున్నా పార్లమెంట్‌ ఎన్నికలు

పని ప్రదేశాలు, రవాణా, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్స్‌లో ఎలా వ్యవహరించాలనే విధివిధానాలను దక్షిణ కొరియా రూపొందించింది. తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం, తరచూ టెంపరేచర్‌ తనిఖీలు, డిస్‌ఇన్ఫెక్షన్‌ చేయడం వంటి చర్యలు ఇకముందూ కొనసాగించాలని స్పష్టం చేసింది. గడిచిన రెండు వారాల్లో విదేశాల నుంచి వచ్చిన వారు కొద్ది రోజులు కార్యాలయాలు, పనిప్రదేశాలకు వెళ్లరాదని, వీడియో కాన్ఫరెన్సులు..ఆన్‌లైన్‌ ట్రైనింగ్‌, ఇంటి నుంచే పనిచేయడం, వెసులుబాటు వేళల్లో పనిచేయడం ద్వారా ఆయా పనులను చక్కబెట్టుకోవాలని సూచించింది.

ప్రజా రవాణాలో ప్రయాణించే వారు విధిగా మాస్క్‌ ధరించాలని, ఖాళీ వరుసల్లో సీటు బుక్‌ చేసుకోవాలని, ట్యాక్సీల కోసం మొబైల్‌ పేమెంట్స్‌ చేయాలని అధికారులు సూచించారు. రెస్టారెంట్లు, కేఫ్స్‌లో త్వరగా ఆహారం తీసుకోవాలని, ఆహారం కోసం వ్యక్తిగత ప్లేట్లనే వినియోగించాలని కోరారు. వ్యాపార సంస్థల యజమానులు కస్టమర్ల సీట్ల మధ్య దూరం పాటించాలని, ఆన్‌లైన్‌ పేమెంట్‌తో హోం డెలివరీలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రతి కార్యాలయంలో శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రజలు జాగ్రత్తతో వ్యవహరిస్తేనే మహమ్మారిని నిరోధించగలుగుతామని అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement