
సియోల్: మానవుడికి ఆహారం తరువాత అత్యంత ఆవశ్యకమైనది నిద్ర. ఏ మనిషికైనా 8 గంటల కనీస నిద్ర అవసరం. అదే సమయంలో అతినిద్ర, నిద్రలేమితో సమస్యలు తప్పవని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఒక రోజులో 10గంటలకు మించి నిద్రపోవడం, ఆరుగంటల కంటే తక్కువగా నిద్రపోవడం వల్ల గుండెవ్యాధులు, డయాబెటిస్ సమస్యలు చుట్టుముడతాయని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.
ఇలాంటివారిలో మెటబాలిక్ సిండ్రోమ్‌లు ఏర్పడటం, నడుము చుట్టుకొలత పరిమితికి మించి పెరుగడం గమనించవచ్చని దక్షిణ కొరియాలోని సియోల్ నేషనల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. అతినిద్ర, నిద్రలేమి కారణంగా పురుషులలో ట్రైగ్లిసరైడ్స్, గ్లూ్లకోజ్ స్థాయిలు పెరుగుతాయి. మహిళల్లో వీటితో పాటు హెచ్‌డీఎల్ స్థాయిలను తగ్గిస్తుందట. వీటికారణంగా గుండె, షుగరు వ్యాధుల బారిన పడతారని స్పష్టం చేశారు. 2004–2013 మధ్యకాలంలోని కొరియన్ల మెడికల్ హిస్టరీని విశ్లేషించి ఈ ఫలితాలు వెల్లడించారు.