ఎవిడెన్స్‌ ఉంటే భారత్‌కే సపోర్టు... | Saudi Foreign Minister On Pulwama Terror Attack | Sakshi
Sakshi News home page

ఆధారాలు ఉంటే భారత్‌కే మద్దతు : సౌదీ మంత్రి

Feb 21 2019 11:11 AM | Updated on Aug 30 2019 8:37 PM

Saudi Foreign Minister On Pulwama Terror Attack - Sakshi

సౌదీ విదేశాంగ మంత్రి ఆదిల్‌ అల్‌ జుబేర్‌(కర్టెసీ : ఎన్డీటీవీ)

యూఎన్‌లో రాజకీయాలు తగదు అన్న విషయం మసూద్‌కు వర్తించదు.

న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి జైషే మహ్మద్‌కు వ్యతిరేకంగా ఆధారాలు సంపాదించినట్లైతే భారత్‌కు తాము తప్పకుండా అండగా ఉంటామని సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఆదిల్‌ ఆల్‌ జుబేర్‌ వ్యాఖ్యానించారు. గురువారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. హేయమైన దాడులకు పాల్పడే ఉగ్రవాదులను ఉపేక్షిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజహర్‌ గురించి అడుగగా... అతడి గురించి సాక్ష్యాధారాలు అందించినట్లైతే ఐరాసలో భారత్‌కు మద్దతు పలుకుతామని తెలిపారు. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు సౌదీ సహాయ పడుతుందని స్పష్టం చేశారు. ఐరాసలో రాజకీయాలను అరికట్టాల్సిన ఆవశ్యకత ఉందని సౌదీ- పాకిస్తాన్‌ సంయుక్త ప్రకటన చేసిందని.. అయితే దానిని మసూద్‌ అజర్‌కు అన్వయించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తమకు భారత్‌- పాకిస్తాన్‌.. ఇరు దేశాల పట్ల నమ్మకం ఉందని, శాంతియుతంగా చర్చలు జరపడం ద్వారా ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తత తగ్గిపోతుందని అభిప్రాయపడ్డారు. (‘ఒక్క చెంప దెబ్బ చాలు.. నా వెనుక ఐఎస్‌ఐ ఉంది’ )

వారిని శిక్షించాల్సిందే..
‘ఉగ్రవాదులను గుర్తించే అంశం పట్ల మాకు స్పష్టమైన విధానాలు ఉన్నాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషించేవారిని, ఉగ్ర సంస్థలకు నాయకత్వం వహించే వారిని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. వారిని కచ్చితంగా చట్టం ముందు నిలబెట్టాల్సిందే. శిక్ష విధించాల్సిందే. అయితే అందుకు సరైన ఆధారాలు సంపాదించాల్సిన ఆవశ్యకత ఉంది. అపుడే బాహ్య ప్రపంచంలో స్వేచ్ఛగా సంచరిస్తున్న ఉగ్రవాదుల ఆగడాలు అరికట్టవచ్చు’ అని ఆదిల్‌ అల్‌-జుబేర్‌ పేర్కొన్నారు. భారత్‌తో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని, సీమాంతర ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు కృషి చేస్తున్న భారత్‌కు అండగా నిలుస్తామని వ్యాఖ్యానించారు.(ఉగ్రవాదం ఉమ్మడి సమస్య)

కాగా పుల్వామా ఉగ్రదాడి జరిగిన తర్వాత సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ పాక్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను పొగుడుతూ.. ఆ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి రక్షించేందుకు 20 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ఒప్పందం కుదర్చుకున్నారు. అనంతరం బుధవారం భారత్‌లో పర్యటించిన సౌదీ క్రౌన్‌ ప్రిన్స్‌.. పుల్వామా ఉగ్రదాడి ప్రస్తావన లేకుండానే ప్రధాని మోదీతో పలు చర్చలు జరిపారు. ఈ మేరకు భారత్‌లో సుమారు 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సల్మాన్‌తో పాటు భారత్‌ వచ్చిన బృందంలో ఒకరైన సౌదీ విదేశాంగ మంత్రి పుల్వామా ఉగ్రదాడి గురించి ప్రస్తావించడం విశేషం. అయితే ఆయన కూడా పాకిస్తాన్‌లాగే ఆధారాలు ఉంటే అంటూ ముక్తాయించడం వెనుక పరోక్షంగా తమ విధానమేమిటో స్పష్టం చేసినట్లుగా తెలుస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.(‘పాక్‌.. మాకు అత్యంత ప్రియమైన దేశం’ )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement