‘సీనియర్స్‌’ కోసం..

Robotic Stick Found For Senior Citizens By Sunil Agarwal - Sakshi

రోబో నడిపిస్తుంది..
ఒకప్పుడు వృద్ధులకు ఊతకర్రలే సాయంగా ఉండేవి. ఇప్పుడు వృద్ధుల కోసం ఆధునిక టెక్నాలజీతో ఒక రోబోటిక్‌ కర్ర అందుబాటులోకి వచ్చింది. అమెరికాలో కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అయిన భారతీయుడు సునీల్‌ అగర్వాల్‌ నేతృత్వం లోని ఓ బృందం ఈ రోబో కర్ర తయారు చేసింది. ఈ రోబోటిక్‌ కేన్‌ ద్వారా వృద్ధులు సునాయాసంగా నడక సాగించే వీలు కలుగుతుంది. ఈ కేన్‌ను పట్టుకుని నడిస్తే.. వారు ఎలా అడుగులు వేస్తున్నారు..ఒక్కో అడుగు వేసేందుకు ఎంత సమయం తీసుకుంటున్నారు.. వంటి విషయాలను దీనిలోని సెన్సర్లు అంచనా వేస్తాయి. తర్వాత దానంతట అదే ఆ కర్ర కదులుతుంది.మొబైల్‌ రోబోకు ఇది అనుసంధానంగా పనిచేస్తుందని అగర్వాల్‌ పేర్కొన్నారు. దీన్ని పట్టుకుని నడిస్తే పక్కన ఓ వ్యక్తి ఉండి వారిని నడిపించినట్లే ఉంటుందని చెప్పారు.

ఈ యాప్‌ చెప్పేస్తుంది..
ఒంటరిగా ఉండే వృద్ధులను అనుక్షణం గమనిస్తుండాలి. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు. దీని కోసం ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన విద్యార్థులు ఛ్చిట్ఛ4u అనే మొబైల్‌ యాప్‌ రూపొందించారు. వృద్ధులకు ఇది సంరక్షకురాలిగా పనిచేస్తుంది. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. ఇంట్లో ఉన్న వృద్ధులు, వారి పిల్లల ఫోన్లలో దీన్ని ఇన్‌స్టాల్‌ చేస్తే చాలు చాలా పనులు చేసేస్తుంది. దీని ద్వారా చాటింగ్, కాల్స్‌ చేయొచ్చు. క్యాబ్‌లు బుక్‌ చేసుకోవచ్చు. ఎప్పుడు ఏ మందులు వేసుకోవాలో ఒకసారి ఫీడ్‌ చేస్తే చాలు ఎప్పటికప్పుడు గుర్తుచేస్తుంది. వారు ఎప్పుడైనా కిందపడితే వెంటనే దానికి అనుసంధానం చేసిన వారి నంబర్‌కు ఆటోమేటిక్‌గా కాల్‌ వెళ్తుంది. వృద్ధులు ఉన్న లొకేషన్‌ షేర్‌ చేస్తుంది. ఇంటర్నెట్‌ సౌకర్యం లేకపోయినా అత్యవసర పరిస్థితుల్లో ఇది పనిచేసేలా డిజైన్‌ చేశారు. 

ప్రపంచవ్యాప్తంగా ఏటా 60 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వారు 5.8 కోట్లు. అంటే ప్రతి సెకనుకు ఇద్దరు వ్యక్తులకు 60 ఏళ్లు నిండుతున్నాయి. చైనా తర్వాత అత్యధిక మంది వృద్ధులు ఉన్న దేశం మనదే. 2050 నాటికి ప్రపంచంలో 15 ఏళ్ల పిల్లలకన్నా వృద్ధులే అధికంగా ఉంటారట. మన దేశంలో 2026 నాటికి వృద్ధుల జనాభా 17.3 కోట్లకు పెరగనుంది. 

  • భారత్‌లో కేరళలో వయోధికులు 12.6 శాతం మంది ఉన్నారు. 
  • గోవాలో 11.2 శాతం, తమిళనాడులో 10.4 శాతం, పంజాబ్‌లో 10.3 శాతం, హిమాచల్‌ ప్రదేశ్‌లో 10.2 శాతం ఉన్నారు.  అతి తక్కువ మంది వృద్ధులున్న రాష్ట్రాల్లో అరుణాచల్‌ప్రదేశ్‌ తొలిస్థానంలో ఉంది. ఇక్కడ 4.6 శాతం మంది ఉన్నారు. 
  • మేఘాలయలో 4.7 శాతం. నాగాలాండ్‌లో 5.2 శాతం. మిజోరంలో 6.3 శాతం.. సిక్కింలో 6.7 శాతం మంది వృద్ధులు ఉన్నారు.
    (నేడు సీనియర్‌ సిటిజన్‌ డే)
Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top