సౌదీ కీలక నిర్ణయం.. మరో సంస్కరణ!

Report Says Saudi Arabia To Put An End To Flogging - Sakshi

రియాద్‌: కట్టుబాట్లకు మారుపేరైన ఎడారి దేశం సౌదీ అరేబియాలో గత కొంతకాలంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. విజన్‌ 2030 కార్యక్రమంలో భాగంగా సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ సామాజిక ఆంక్షలను సడలిస్తున్నారు. సామాజిక, ఆర్థిక సంస్కరణల్లో మహిళల పట్ల సానుకూల వైఖరి ప్రదర్శించడంతో పాటుగా.. తొలిసారిగా విదేశీ టూరిస్టులకు వీసా జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో సౌదీ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన పౌరులను కొరడా దెబ్బలు కొట్టే సంప్రదాయానికి స్వస్తి పలికినట్లు సమాచారం. 

ఇందుకు ప్రత్యామ్నాయంగా సదరు పౌరులకు నేర తీవ్రతను బట్టి జైలు శిక్ష లేదా జరిమానా విధించడం లేదా రెండూ అమలు చేసేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సౌదీ సుప్రీంకోర్టు జనరల్‌ కమిషన్‌ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘రాజు సల్మాన్‌, యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఆదేశాలను అనుసరించి మానవ హక్కుల సంస్కరణలను ప్రవేశపెడుతున్నాం’’అని సదరు ప్రకటనలో పేర్కొన్నారు. ఇక ప్రభుత్వం తాజా నిర్ణయంపై మానవ హక్కుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. అయితే ఈ సంస్కరణ ఎన్నో ఏళ్ల క్రితమే చేపట్టాల్సిందని అభిప్రాయపడ్డాయి. ఈ విషయం గురించి సౌదీ మానవ హక్కుల కమిషన్‌ అధ్యక్షుడు అవాద్‌ అల్వాద్‌ మాట్లాడుతూ.. ‘‘గత కొన్నిరోజులుగా రాజ్యంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. హ్యూమన్‌ రైట్స్‌ అజెండాలో సరికొత్త ముందడుగు ఇది’’అని వ్యాఖ్యానించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top