భారత్ పేర్కొంటున్న 7.5% వృద్ధి రేటు అంచనాలకు మించి ఉందని అమెరికా వ్యాఖ్యానించింది.
భారత్ వృద్ధిపై అమెరికా వ్యాఖ్య
వాషింగ్టన్ : భారత్ పేర్కొంటున్న 7.5% వృద్ధి రేటు అంచనాలకు మించి ఉందని అమెరికా వ్యాఖ్యానించింది. ఆ వృద్ధి రేటు సాధ్యమవ్వాలంటే భారత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన రంగాల్లో ఆర్థిక సంస్కరణల అమలును వేగవంతం చేయాల్సి ఉందని పేర్కొంది. భూ సేకరణ, జీఎస్టీ.. తదితర కీలక బిల్లులపై అవసరమైన మద్దతు కూడగట్టడంలో వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ.. మోదీ ప్రభుత్వం పేర్కొన్న చాలా సంస్కరణలు పార్లమెంటులో ఆమోదం పొందేందుకు ఎదురు చూస్తున్నాయని వ్యాఖ్యానించింది.
దీనివల్ల గతంలో ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతిచ్చిన పలువురు పెట్టుబడిదారులు వెనకడుగు వేస్తున్నారంది. జీఎస్టీ ఆమోదం పొందితే జీడీపీ వృద్ధికి అది గొప్ప ఊతమవుతుందని వ్యాఖ్యానించింది. అయితే, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి పెంపు సహా కేంద్రం తీసుకున్న పలు నిర్ణయాలను యూఎస్ ‘బ్యూరొ ఆఫ్ ఎకనమిక్ అండ్ బిజినెస్ ఎఫైర్స్’ విడుదల చేసిన ‘ఇన్వెస్ట్‌మెంట్ క్లైమేట్ స్టేట్‌మెంట్స్ ఫర్ 2016’ నివేదికలో ప్రశంసించారు. వ్యవస్థీకృత లోపాలు, నియంత్రణ వ్యవస్థలో బలహీనతలు, పన్ను, విధాన నిర్ణయాల్లో అనిశ్చితి, మౌలిక వసతుల కల్పనలో అడ్డంకులు, స్థానిక సమస్యలు, విద్యుత్ సరఫరా లోపాలు.. మొదలైనవి భారత ఆర్థిక వృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆ నివేదికలో పేర్కొన్నారు.