క్రిస్టియన్‌ మహిళ కేసులో పాక్‌ కోర్టు సంచలన తీర్పు

Pakistan Apex Court Delivered Landmark Verdict In Blasphemy Case - Sakshi

దైవ దూషణ చేసిన క్రిస్టియన్‌ మహిళపై కనికరం

ఇస్లామాబాద్‌ : దైవ దూషణ చేసిన క్రిస్టియన్‌ మహిళపై పాకిస్తాన్‌ సుప్రీం కోర్టు కనికరం చూపింది. కింది కోర్టు విధించిన మరణశిక్షను రద్దు చేస్తూ చీఫ్‌ జస్టిస్‌ సాఖిబ్‌ నిసార్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. వివరాలు.. క్రిస్టియన్‌ మతానికి చెందిన అసియా బీబీ ఇస్లాం మతాన్ని దూషిస్తూ తరచూ ఇరుగుపొరుగు వారితో గొడవకు దిగేది. తమ మతంపై అసియా అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇస్లాంను దూషించిన అసియాకు బతికే అర్హత లేదనీ.. ఆమెకు కఠిన శిక్ష విధిం‍చాలని 2009లో కోర్టును ఆశ్రయించారు.

అసియాకు ఉరిశిక్ష
పవిత్ర ఇస్లాం మతాన్ని దూషించి ప్రజల మనోభావాల్ని దెబ్బతీశావంటూ లాహోర్‌ హైకోర్టు 2010లో అసియాకు మరణశిక్ష విధించింది. ఈ తీర్పుపై పాకిస్తాన్‌ వ్యాప్తంగా కొందరు ఆమెకు మద్దతుగా నిలవగా.. మరికొందరు ఆమెకు పాపం పండిందని ఆనందం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పుపై అసియా సుప్రీం కోర్టును ఆశ్రయించిగా.. నిందితురాలు గత ఎనిమిది సంవత్సరాలుగా ‘ఏకాంతవాస’శిక్షను అనుభవిస్తుండడంతో కోర్టు ఆమెకు విధించిన మరణశిక్షను రద్దు చేసింది. ఇదిలాఉండగా.. ఈ కేసుపై మూడు వారాల క్రితమే కోర్టు నిర్ణయం తీసుకుందనీ, అయితే నిరసనలను అదుపు చేసేందుకు తీర్పును రిజర్వులో ఉంచారని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

ఆయన మరణంతో అలజడి..
అసియాకు ఉరిశిక్ష విధించిన లాహోర్‌ హైకోర్టు వ్యవహారాన్ని ఖండించి, ఆమెకు మద్దతుగా నిలిచిన పంజాబ్‌ గవర్నర్‌ సల్మాన్‌ తసీర్‌ 2011లో హత్యకు గురికావడంతో పాకిస్తాన్‌లో అలజడి రేగింది. ఈ నేపథ్యంలోనే అసియా కేసులో కోర్టు జాగ్రత్తలు చేపట్టింది. నిరసనలు చెలరేగకుండా పోలీసులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఏదేమైనా ఇస్లాం నిరసనకారుల వల్ల అసియాకు ఇబ్బందులు తప్పక పోవచ్చుననీ, జైలు నుంచి విడుదలైన అనంతరం ఆమె రక్షణ ప్రమాదంలో పడొచ్చననే భయాలు నెలకొన్నాయయి. ఉగ్రవాదులు ఆమెపై దాడికి పాల్పడవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉండగా.. అప్పటి ప్రధాని జియావుల్‌ హక్‌ 1980లో దైవ దూషణ నేరంగా పరిగణించే చట్టాలు తెచ్చారు. అయితే, వ్యక్తిగత కక్ష్యసాధింపు చర్యలకు ఈ చట్టాలు అవకాశం కల్పిస్తాయని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top