సంబరానికి నాటా సై..!

North American Telugu Association Celebrations Starts In July - Sakshi

జూలై 6, 7, 8 తేదీల్లో మహాసభలు 

ఫిలడెల్ఫియా వేదికగా వేడుకలు

సాక్షి, హైదరాబాద్‌: సప్త సముద్రాల ఆవల తెలుగు మహా సంబరానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నార్త్‌ అమెరికా తెలుగు అసోసియేషన్‌ (నాటా) కనీవినీ ఎరుగని రీతిలో వేడుకలకు సిద్ధమవుతోంది. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం ఫిలడెల్ఫియా వేదికగా జూలై 6, 7, 8 తేదీల్లో జరగనున్న నాటా మహా సభలకు 13 వేల మంది హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు నాటా సభలకు అతిథులుగా హాజరు కానున్నారు. సామాజిక సేవ, తెలుగు సంస్కృతిని భవిష్యత్‌ తరాలకు అందించాలన్న లక్ష్యంగా ఏర్పడిన నాటా.. అనతి కాలంలో మహావృక్షంగా మారింది. విద్యా, ఉద్యోగాలు, వ్యాపార అవకాశాల కోసం అమెరికా వచ్చే వారిని ఒక్కతాటిపైకి తీసుకొచ్చి. తర్వాతి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి సేవలందించడం ప్రారంభించింది. రెండేళ్లకోసారి కన్వెన్షన్‌ నిర్వహిస్తున్న నాటా.. 2016లో డాలస్‌లో, ఈసారి ఫిలడెల్ఫియాలో వేడుకలు నిర్వహిస్తోంది. 

సామాజిక సేవే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం: గంగసాని రాజేశ్వర్‌ రెడ్డి, అధ్యక్షుడు 
అమెరికాలోని అన్ని రాష్ట్రాల నుంచి నాటాకు ప్రాతినిధ్యం ఉంది. నిజాయతీ, నిబద్ధత, అంకిత భావం, సామాజిక సేవ అనే పునాదులపై నాటాను ముందుకు తీసుకెళ్తున్నాం. తెలుగు సంస్కృతి, వారసత్వాన్ని భవిష్యత్‌ తరాలకు అందిస్తున్నాం. ఈసారి ఫిలడెల్ఫియాలో జరగనున్న మహాసభలకు 13 వేల మంది రానున్నారు. 

ఒకే గొడుగు కిందకు వస్తున్నాం: డాక్టర్‌ ప్రేంసాగర్‌ రెడ్డి, నాటా అడ్వైజరీ కౌన్సిల్‌ 
నాటాతో ఎన్నారైలకు విడదీయరాని అనుబంధం ఉంది. ప్రాంతీయ భేదాలు లేవు. అందరం ఒకే గొడుగు కిందికి వస్తున్నాం. నేను నెల్లూరు జిల్లాలోని మారుమూల ప్రాంతం నుంచి వచ్చా. అమెరికాకు వచ్చి అతిపెద్ద ఆస్పత్రుల నెట్‌వర్క్‌ ప్రైమ్‌ ఏర్పాటు చేసి 45 వేల అమెరికన్లకు ఉద్యోగాలిచ్చా.

నాటా వేదికగా వైఎస్సార్‌ జయంతి 
దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతిని నాటా వేదికగా నిర్వహిస్తామని వైఎస్సార్‌సీపీ తెలిపింది. నాటా నిర్వహించనున్న పొలిటికల్‌ ఫోరంలో భాగంగా వైఎస్సార్‌ను స్మరించుకుంటామని ప్రకటించింది. మహా సభలకు హాజరు కావాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానించారని, అయితే పాదయాత్ర కారణంగా ఆయన రాలేకపోతున్నారని పార్టీ తెలిపింది. నాటా ప్రతినిధులు, అతిథులను ఉద్దేశించి తన సందేశాన్ని వైఎస్‌ జగన్‌ పంపనున్నట్టు పార్టీ నేతలు పేర్కొన్నారు. పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌ రెడ్డి సహా పలువురు ముఖ్య నేతలు ఈ వేడుకలకు హాజరు కానున్నారని చెప్పారు.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top