ఉద్యోగం పోయినా లాటరీలో కోట్లు వచ్చాయి

New Zealand Man Wins Lottery After Losing Job Due To Lockdown - Sakshi

వెల్లింగ్టన్‌ : ఈ వార్త చదివిన తర్వాత అదృష్టం తలుపు తట్టడం అంటే ఇదేనేమో అనిపిస్తుంది. లాక్‌డౌన్‌ పుణ్యమా అని ఉద్యోగం కోల్పోయిన ఒక వ్యక్తికి అక్షరాల రూ. 46 కోట్లు లాటరీ ద్వారా తగిలాయి. దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ వింత ఘటన న్యూజిలాండ్‌లో చోటుచేసుకుంది. కరోనా వ్యాప్తి కారణంగా ప్రపంచదేశాలు లాక్‌డౌన్‌తో కట్టడికి తీవ్రంగా కృషిచేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పలు సంస్థలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించే పని చేపట్టాయి.

ఈ విధంగా న్యూజిలాండ్‌కు చెందిన ఓ వ్యక్తికి కూడా ఉద్యోగం ఊడింది. అయితే ఆయన ఎప్పుడో తీసుకొన్న లాటరీ టికెట్‌ అదృష్టాన్ని తీసుకొచ్చిందనే చెప్పాలి. ఉద్యోగం ఊడిపోవడంతో ఇంట్లోనే ఖాళీగా ఉంటున్న ఆ వ్యక్తికి కంప్యూటర్‌ ఏదో చూస్తుండగా వెబ్‌సైట్‌లో లాటరీ ఫలితాలు కనిపించాయి. దీంతో తనకు ఏమైనా అదృష్టం కలిసొస్తుందేమోనని లాటరీ టికెట్‌ను చెక్‌ చేశాడు.  ఈ నేపథ్యంలోనే  ఆ వ్యక్తికి  దాదాపు రూ.46 కోట్ల (10.3 న్యూజిలాండ్‌ డాలర్స్‌) ప్రైజ్‌ మనీ వచ్చింది. ఈ విషయాన్ని మైలోటో కస్టమర్ సపోర్ట్‌ కూడా స్పష్టం చేసింది.

ఉద్యోగం చేస్తున్న భార్య ఇంటికి రాగానే లాటరీ తగిలిన విషయం చెప్పి.. ఆమెను సర్‌ప్రైజ్‌ చేశాడు. ముందు ఆమె నమ్మకపోయినా లాటరీ టికెట్‌ చూపించడంతో ఎగిరి గంతేసింది. ' మా పంట పండిందనే చెప్పాలి. మొత్తానికి లాటరీ ద్వారా కోట్లు సంపాదించిన తాము ఆ డబ్బుతో ముందుగా పాతబడిన కారును రిపేరింగ్‌ చేయించుకోవాలి. తర్వాత మిగిలిన డబ్బుతో మంచి ఇళ్లుతో పాటు పిల్లలకు ఉన్నత విద్యను చెప్పించాలని నిర్ణయించుకున్నామని' సదరు వ్యక్తి భార్య పేర్కొన్నారు.
(కరోనా.. 24 గంటల్లో 132 మంది మృతి)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top