సినిమా చూసి విమానం కూల్చేశాడా? | lubitz may have seen the movie wild tales before crashing plane | Sakshi
Sakshi News home page

సినిమా చూసి విమానం కూల్చేశాడా?

Mar 28 2015 3:29 PM | Updated on Sep 2 2017 11:31 PM

సినిమా చూసి విమానం కూల్చేశాడా?

సినిమా చూసి విమానం కూల్చేశాడా?

వైల్డ్ టేల్స్ అనే సినిమా చూసి.. దాని స్ఫూర్తితోనే కో-పైలట్ లూబిట్జ్ జర్మన్ వింగ్స్ విమానాన్ని కూల్చేసినట్లు అనుమానాలు వస్తున్నాయి.

ఈ ఏడాది ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన అర్జెంటీనా చిత్రం 'వైల్డ్ టేల్స్'కు, జర్మనీ విమానం 'ఎయిర్‌బస్ ఏ 320'  ఆల్ప్స్ పర్వతాల్లో కూలిపోయిన సంఘటనకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. ఈ సినిమాలో కూడా పైలట్ కాక్‌పిట్‌ను లాక్ చేస్తాడు. ఆపదలో ఉన్న ప్రయాణికులు కాక్‌పిట్ తలుపును తెరవాలని ఎంత మొత్తుకున్నా తలుపు తెరవకుండా లూబిడ్జ్ లాగానే అతివేగంతో విమానాన్ని కిందకు తీసుకెళ్లి కూల్చేస్తాడు. విమానంలోని అందరు ప్రయాణికులతోపాటు తాను చనిపోతాడు. ప్రేమించి తనను మోసం చేసిన అమ్మాయిని, వర్క్ ప్లేస్‌లో తనను ఎప్పుడూ అవమానించే శత్రువులను విమానంలోకి ఎక్కించుకొని ఈ దారుణానికి పాల్పడతాడు.

వాస్తవంగా లూబిడ్జ్ విమానాన్ని పర్వతాల్లో కూల్చేయగా, సినిమాలో పైలట్ తన తల్లిదండ్రులున్న ఇంటిపై విమానాన్ని కూల్చేస్తాడు. వారు కూడా ఈ ప్రమాదంలో చనిపోతారు. తన జీవితంతో ముడిపడ్డ వారిని మాత్రమే విమానంలో ఎక్కించుకొని వారందరి మరణానికి సినిమాలో పైలట్ కారణం కాగా, నిజజీవితంతో లూబిడ్జ్ ఏ పాపం తెలియని 149 మంది అమాయక ప్రయాణికులను పొట్టన పెట్టుకున్నాడు. 'వైల్డ్ టేల్స్'  చిత్రం జర్మనీ, స్పెయిన్ దేశాల్లో గతేడాదే విడుదల కాగా, శనివారం (28 మార్చి) బ్రిటన్‌లో విడుదలయింది. ఈ చిత్రాన్ని లూబిడ్జ్ చూశాడా, లేడా అన్నది తెలియదు. అతను జర్మనీలో ఉన్నందున, సినిమా తరహాలోనే విమానాన్ని కూల్చేసినందున వైల్డ్ టేల్స్‌ను చూసే స్ఫూర్తి పొంది ఉంటాడన్నది అనుమానం.

ఈ దశలో బ్రిటన్‌లో 'వైల్డ్ టేల్స్' చిత్రాన్ని విడుదల చేయడంపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. విమాన ప్రమాద బాధిత కుటుంబాల బాధను, ఆవేదనను అర్థం చేసుకోకుండా బ్రిటిష్ డిస్ట్రిబ్యూటర్లు సొమ్ము చేసుకోవడానికే ఈ చిత్రాన్ని ఈ దశలో విడుదల చేశారన్నది విమర్శకుల వాదన. ఆల్ప్స్ పర్వతాల్లో కూలిపోయిన విమాన ప్రమాదంలో ముగ్గురు బ్రిటిష్ పౌరులు మరణించిన విషయం తెలిసిందే. తాము బాధిత కుటుంబాల మనోభావాలను గౌరవిస్తామని, అయితే చాలాకాలం ముందే విడుదల తేదీలను ప్రకటించడంతో ప్రజలు ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకున్నందున, మెజారిటీ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొనే సినిమాను విడుదల చేయాల్సి వచ్చిందని డిస్ట్రిబ్యూటర్లు వాదిస్తున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement