breaking news
germanwings flight accident
-
సినిమా చూసి విమానం కూల్చేశాడా?
ఈ ఏడాది ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన అర్జెంటీనా చిత్రం 'వైల్డ్ టేల్స్'కు, జర్మనీ విమానం 'ఎయిర్‌బస్ ఏ 320' ఆల్ప్స్ పర్వతాల్లో కూలిపోయిన సంఘటనకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. ఈ సినిమాలో కూడా పైలట్ కాక్‌పిట్‌ను లాక్ చేస్తాడు. ఆపదలో ఉన్న ప్రయాణికులు కాక్‌పిట్ తలుపును తెరవాలని ఎంత మొత్తుకున్నా తలుపు తెరవకుండా లూబిడ్జ్ లాగానే అతివేగంతో విమానాన్ని కిందకు తీసుకెళ్లి కూల్చేస్తాడు. విమానంలోని అందరు ప్రయాణికులతోపాటు తాను చనిపోతాడు. ప్రేమించి తనను మోసం చేసిన అమ్మాయిని, వర్క్ ప్లేస్‌లో తనను ఎప్పుడూ అవమానించే శత్రువులను విమానంలోకి ఎక్కించుకొని ఈ దారుణానికి పాల్పడతాడు. వాస్తవంగా లూబిడ్జ్ విమానాన్ని పర్వతాల్లో కూల్చేయగా, సినిమాలో పైలట్ తన తల్లిదండ్రులున్న ఇంటిపై విమానాన్ని కూల్చేస్తాడు. వారు కూడా ఈ ప్రమాదంలో చనిపోతారు. తన జీవితంతో ముడిపడ్డ వారిని మాత్రమే విమానంలో ఎక్కించుకొని వారందరి మరణానికి సినిమాలో పైలట్ కారణం కాగా, నిజజీవితంతో లూబిడ్జ్ ఏ పాపం తెలియని 149 మంది అమాయక ప్రయాణికులను పొట్టన పెట్టుకున్నాడు. 'వైల్డ్ టేల్స్' చిత్రం జర్మనీ, స్పెయిన్ దేశాల్లో గతేడాదే విడుదల కాగా, శనివారం (28 మార్చి) బ్రిటన్‌లో విడుదలయింది. ఈ చిత్రాన్ని లూబిడ్జ్ చూశాడా, లేడా అన్నది తెలియదు. అతను జర్మనీలో ఉన్నందున, సినిమా తరహాలోనే విమానాన్ని కూల్చేసినందున వైల్డ్ టేల్స్‌ను చూసే స్ఫూర్తి పొంది ఉంటాడన్నది అనుమానం. ఈ దశలో బ్రిటన్‌లో 'వైల్డ్ టేల్స్' చిత్రాన్ని విడుదల చేయడంపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. విమాన ప్రమాద బాధిత కుటుంబాల బాధను, ఆవేదనను అర్థం చేసుకోకుండా బ్రిటిష్ డిస్ట్రిబ్యూటర్లు సొమ్ము చేసుకోవడానికే ఈ చిత్రాన్ని ఈ దశలో విడుదల చేశారన్నది విమర్శకుల వాదన. ఆల్ప్స్ పర్వతాల్లో కూలిపోయిన విమాన ప్రమాదంలో ముగ్గురు బ్రిటిష్ పౌరులు మరణించిన విషయం తెలిసిందే. తాము బాధిత కుటుంబాల మనోభావాలను గౌరవిస్తామని, అయితే చాలాకాలం ముందే విడుదల తేదీలను ప్రకటించడంతో ప్రజలు ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకున్నందున, మెజారిటీ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొనే సినిమాను విడుదల చేయాల్సి వచ్చిందని డిస్ట్రిబ్యూటర్లు వాదిస్తున్నారు. -
విమానప్రమాద బాధితులకు భారీ పరిహారం
ఆల్ప్స్ పర్వతాల్లో విమానం కూలిపోయి మరణించిన 149 (కో పైలట్ లూబిడ్జ్‌ని మినహాయించి) మంది బాధితుల కుటుంబాలకు లుఫ్తాన్సా విమానయాన సంస్థ నష్ట పరిహారం కింద కోట్లాది రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. తక్షణ సహాయం కింద శుక్రవారం రాత్రి ఒక్కో ప్రయాణికుడికి రూ. 34 లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించింది. 1999 నాటి మాంట్రీల్ అంతర్జాతీయ ఒడంబడిక ప్రకారం ఒక్కో బాధితుడికి రూ. 98 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. తమ కుటుంబానికి భారీ నష్టం జరిగినట్టు బాధితుల కుటుంబాలు కోర్టులో రుజువు చేస్తే ఈ నష్ట పరిహారం మరింత పెరుగుతుంది. థర్ట్ పార్టీ కారణంగా విమాన ప్రమాదం జరిగినట్లు లుఫ్తాన్సా రుజువు చేయగలిగితే తాము చెల్లించాల్సిన నష్ట పరిహారం భారీగా తగ్గుతుంది. అయితే ఈ విమాన ప్రమాద సంఘటలో అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే కో పైలట్ ప్రమాదానికి బాధ్యుడని ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన సాక్ష్యాధారాలు రుజువు చేస్తున్నాయి కనుక. విమానయాన నిబంధనల ప్రకారం పైలట్ల మానసిక పరిస్థితిని సంస్థలు ఎప్పటికప్పుడు అంచనా వేస్తుండాలి. అందుకు అవసరమైన ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తుండాలి. అంతేకాదు... విమానం నడిపేముందు ప్రతిసారీ పైలట్ ఫిట్నెస్ను తెలుసుకోవాలి. ఈ విషయంలో లుఫ్తాన్సా పూర్తిగా విఫలమైనందున ఇందుకు కోర్టులు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది.