breaking news
co pilot lubitz
-
కో పైలట్ బలవంతంగా టాయిలెట్లోకి వచ్చాడు
ముంబై: ఇండిగో విమాన ప్రయాణికురాలు చేసిన ఫిర్యాదు తీవ్ర కలకలం రేపుతోంది. విమానం టాయిటెల్ సీటుపై తాను కూర్చుని ఉండగానే కో పైలట్ అందులోకి బలవంతంగా ప్రవేశించాడని ఆరోపించారు. ఆగస్ట్ 8వ తేదీ రాత్రి విమానం టేకాఫ్ తీసుకోకమునుపే ఇలా జరిగిందని ఆమె తెలిపారు. బంగారం వ్యాపార సంస్థ ‘సేఫ్ గోల్డ్’సహ వ్యవస్థాపకురాలు రియా ఛటర్జీ ఇందుకు సంబంధించి తనకు కలిగిన ఇబ్బందికరమైన అనుభవాన్ని లింక్డ్ ఇన్‌లో షేర్ చేశారు. కో పైలట్ చర్య తనకు షాక్ కలిగించిందని పేర్కొన్నారు. ‘లావెట్రీ లోపలికెళ్లి లాక్ చేసుకున్నాక, తలుపుపై తట్టిన శబ్ధం వినిపించగా బదులిచ్చా. ఆ వెంటనే మరోసారి తలుపు చప్పుడు వినిపించగా మరింత బిగ్గరగా బదులిచ్చా. అయినప్పటికీ కో పైలట్ బలవంతంగా తలుపు నెట్టుకుని లోపలికి వచ్చాడు. తనను చూసి, ఓహ్ అనుకుంటూ డోరు మూసి వెళ్లిపోయాడు’అని వివరించారు. ఇది తెలిసిన మహిళా సిబ్బంది సారీతో సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. మరో గత్యంతరం లేక నా సీటులోకి వెళ్లి కూర్చున్నానని ఛటర్జీ తెలిపారు. ఘటనపై ఇండిగో యాజమాన్యానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వారెవరూ తనతో నేరుగా మాట్లాడలేదని ఆరోపించారు. అయితే, ఈ ఘటనపై పరిహారం కావాలని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. -
సినిమా చూసి విమానం కూల్చేశాడా?
ఈ ఏడాది ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన అర్జెంటీనా చిత్రం 'వైల్డ్ టేల్స్'కు, జర్మనీ విమానం 'ఎయిర్‌బస్ ఏ 320' ఆల్ప్స్ పర్వతాల్లో కూలిపోయిన సంఘటనకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. ఈ సినిమాలో కూడా పైలట్ కాక్‌పిట్‌ను లాక్ చేస్తాడు. ఆపదలో ఉన్న ప్రయాణికులు కాక్‌పిట్ తలుపును తెరవాలని ఎంత మొత్తుకున్నా తలుపు తెరవకుండా లూబిడ్జ్ లాగానే అతివేగంతో విమానాన్ని కిందకు తీసుకెళ్లి కూల్చేస్తాడు. విమానంలోని అందరు ప్రయాణికులతోపాటు తాను చనిపోతాడు. ప్రేమించి తనను మోసం చేసిన అమ్మాయిని, వర్క్ ప్లేస్‌లో తనను ఎప్పుడూ అవమానించే శత్రువులను విమానంలోకి ఎక్కించుకొని ఈ దారుణానికి పాల్పడతాడు. వాస్తవంగా లూబిడ్జ్ విమానాన్ని పర్వతాల్లో కూల్చేయగా, సినిమాలో పైలట్ తన తల్లిదండ్రులున్న ఇంటిపై విమానాన్ని కూల్చేస్తాడు. వారు కూడా ఈ ప్రమాదంలో చనిపోతారు. తన జీవితంతో ముడిపడ్డ వారిని మాత్రమే విమానంలో ఎక్కించుకొని వారందరి మరణానికి సినిమాలో పైలట్ కారణం కాగా, నిజజీవితంతో లూబిడ్జ్ ఏ పాపం తెలియని 149 మంది అమాయక ప్రయాణికులను పొట్టన పెట్టుకున్నాడు. 'వైల్డ్ టేల్స్' చిత్రం జర్మనీ, స్పెయిన్ దేశాల్లో గతేడాదే విడుదల కాగా, శనివారం (28 మార్చి) బ్రిటన్‌లో విడుదలయింది. ఈ చిత్రాన్ని లూబిడ్జ్ చూశాడా, లేడా అన్నది తెలియదు. అతను జర్మనీలో ఉన్నందున, సినిమా తరహాలోనే విమానాన్ని కూల్చేసినందున వైల్డ్ టేల్స్‌ను చూసే స్ఫూర్తి పొంది ఉంటాడన్నది అనుమానం. ఈ దశలో బ్రిటన్‌లో 'వైల్డ్ టేల్స్' చిత్రాన్ని విడుదల చేయడంపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. విమాన ప్రమాద బాధిత కుటుంబాల బాధను, ఆవేదనను అర్థం చేసుకోకుండా బ్రిటిష్ డిస్ట్రిబ్యూటర్లు సొమ్ము చేసుకోవడానికే ఈ చిత్రాన్ని ఈ దశలో విడుదల చేశారన్నది విమర్శకుల వాదన. ఆల్ప్స్ పర్వతాల్లో కూలిపోయిన విమాన ప్రమాదంలో ముగ్గురు బ్రిటిష్ పౌరులు మరణించిన విషయం తెలిసిందే. తాము బాధిత కుటుంబాల మనోభావాలను గౌరవిస్తామని, అయితే చాలాకాలం ముందే విడుదల తేదీలను ప్రకటించడంతో ప్రజలు ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకున్నందున, మెజారిటీ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొనే సినిమాను విడుదల చేయాల్సి వచ్చిందని డిస్ట్రిబ్యూటర్లు వాదిస్తున్నారు.