
ఇండిగో ప్రయాణికురాలి ఫిర్యాదు
ముంబై: ఇండిగో విమాన ప్రయాణికురాలు చేసిన ఫిర్యాదు తీవ్ర కలకలం రేపుతోంది. విమానం టాయిటెల్ సీటుపై తాను కూర్చుని ఉండగానే కో పైలట్ అందులోకి బలవంతంగా ప్రవేశించాడని ఆరోపించారు. ఆగస్ట్ 8వ తేదీ రాత్రి విమానం టేకాఫ్ తీసుకోకమునుపే ఇలా జరిగిందని ఆమె తెలిపారు. బంగారం వ్యాపార సంస్థ ‘సేఫ్ గోల్డ్’సహ వ్యవస్థాపకురాలు రియా ఛటర్జీ ఇందుకు సంబంధించి తనకు కలిగిన ఇబ్బందికరమైన అనుభవాన్ని లింక్డ్ ఇన్‌లో షేర్ చేశారు. కో పైలట్ చర్య తనకు షాక్ కలిగించిందని పేర్కొన్నారు. ‘లావెట్రీ లోపలికెళ్లి లాక్ చేసుకున్నాక, తలుపుపై తట్టిన శబ్ధం వినిపించగా బదులిచ్చా.
ఆ వెంటనే మరోసారి తలుపు చప్పుడు వినిపించగా మరింత బిగ్గరగా బదులిచ్చా. అయినప్పటికీ కో పైలట్ బలవంతంగా తలుపు నెట్టుకుని లోపలికి వచ్చాడు. తనను చూసి, ఓహ్ అనుకుంటూ డోరు మూసి వెళ్లిపోయాడు’అని వివరించారు. ఇది తెలిసిన మహిళా సిబ్బంది సారీతో సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. మరో గత్యంతరం లేక నా సీటులోకి వెళ్లి కూర్చున్నానని ఛటర్జీ తెలిపారు. ఘటనపై ఇండిగో యాజమాన్యానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వారెవరూ తనతో నేరుగా మాట్లాడలేదని ఆరోపించారు. అయితే, ఈ ఘటనపై పరిహారం కావాలని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు.