
సాక్షి, న్యూఢిల్లీ : భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ క్షమాభిక్ష విషయంలో త్వరలోనే ఓ నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది. జాదవ్ మెర్సీ పిటిషన్ గురువారం సైన్యాధ్యకుడు ఖమర్ జాదవ్ బజ్వా వద్దకు చేరిందని ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ చెప్పారు.
జాదవ్ కేసులో త్వరలో నిర్ణయం వెలువడే అవకాశం ఉందని గఫూర్ పేర్కొన్నారు. కాగా, తనకు విధించిన మరణశిక్షను కొట్టేయాలంటూ అప్పిలేట్ కోర్టు క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు దానిని కొట్టివేసింది. దీంతో ఆయన పాక్ ఆర్మీ చీఫ్‌ను ఆశ్రయించారు. ఒకవేళ ఆయన కూడా దానిని కొట్టివేస్తే నేరుగా పాక్ అధ్యక్షుడిని ఆశ్రయంచవచ్చు.
అయితే క్షమాభిక్ష పిటిషన్ ఆర్మీ ఛీఫ్ తిరస్కరించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయన్న సంకేతాలు అందుతున్నాయి. ‘పాక్ ప్రజలు త్వరలోనే ఓ శుభవార్త వినబోతున్నారు’ అంటూ జాదవ్ క్షమాభిక్షను ఉద్దేశిస్తూ... పాకిస్థాన్ ఏజెన్సీ సంస్థ ఇంటర్-స్టేట్ పబ్లిక్ రిలేషన్స్(ఐఎస్‌పీఆర్) ఓ ప్రకటన వెలువరించటంతో ఆయన ప్రాణాలకు ముప్పుతప్పదనే భావించవచ్చు.
కాగా, గూఢచర్యం ఆరోపణలతో కుల్‌భూషణ్ జాదవ్ ను 2016లో పాకిస్థాన్ అరెస్ట్ చేసింది. ఆపై పాక్ ఆర్మీ కోర్టు మరణశిక్ష విధించగా.. 46 ఏళ్ల జాదవ్ తరపున భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. భారత్ పిటిషన్‌పై మే 18న విచారించిన 10 మంది సభ్యుల ఐసీజే ధర్మాసనం.. జాదవ్ మరణశిక్షపై స్టే విధించింది. అయితే జాదవ్ క్షమాభిక్ష పిటిషన్లపై ఓ స్పష్టత వచ్చేంత వరకు ఆయనకు మరణశిక్ష అమలు చేయబోమని పాక్ స్పష్టం చేసింది.