విడోడో విజయం.. దేశ వ్యాప్తంగా ఉద్రిక్తత

Joko Widodo Re Elected As Indonesian President - Sakshi

ఇండోనేషియా అధ్యక్ష పీఠంపై మరోసారి జూకో విడోడో

భారీగా రిగ్గింగ్‌ ఆరోపణలు

విపక్ష నేత మద్దతుదారుల ఆందోళన.. బలగాల మోహరింపు

జకార్త: దీవుల దేశం ఇండోనేషియాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జోకో విడోడో మరోసారి విజయం సాధించారు. గతనెల దేశ వ్యాప్తంగా ప్రెసిడెంట్‌ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలను సోమవారం అర్థరాత్రి దేశ ఎన్నికల సంఘం విడుదల చేసింది. విపక్ష నేత మాజీ ఆర్మీ జనరల్‌, ప్రత్యర్థి ప్రబోవో సుబియాంటోపై జోకో విడోడో రెండోసారి విజయం సాధించారని ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఏప్రిల్‌ 17న దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో విడోడో నేతృత్వంలోని ఇండోనేషియా డెమోక్రటిక్‌ పార్టీకి 55.5శాతం, ప్రబోవో సుబియాంటోకు 44.5శాతం ఓట్లు వచ్చినట్లు ఈసీ ప్రకటించింది.

అయితే ప్రబోవోకు వ్యతిరేకంగా ఫలితాలు రావడంతో ఆయన మద్దతు దారులు అర్థరాత్రి దేశ రాజధాని జకార్తలో ఆందోళకు దిగారు. ఎన్నికల్లో విడోడో పెద్ద మొత్తంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, రిగ్గింగ్‌ జరగిందని వారు ఆరోపిస్తున్నారు. విడోడో విజయాన్ని తాము అంగీకరించేది లేదని, తమకు జరిగిన అన్యాయంపై కోర్టుకు వెళ్తామని ప్రబోవో తెల్చిచెప్పారు. పలు ప్రాంతాల్లో హింస చెలరేగే అవకాశం ఉన్నందున ముందస్తుగా జకార్తలో భారీ ఎత్తున భద్రతా సిబ్బందిని మోహరించారు. పోలింగ్ ప్రారంభం కాకముందు నుంచే రిగ్గింగ్‌ ఆరోపణలు దుమారం రేపిన విషయం తెలిసిందే. పొరుగున ఉన్న మలేసియాలో ఓ గోదాం దగ్గర వేలాదిమంది బ్యాలెట్ పత్రాలు పట్టుకుని బారులుతీరినట్లు కనిపిస్తున్న ఓ వీడియో బయటకు రావడంతో దానిపై ఇండోనేసియా ఎన్నికల సంఘం దర్యాప్తు చేపట్టింది.

ఆ గోదాం దగ్గర ఉన్నవారిలో ఎక్కువ శాతం ప్రస్తుత అధ్యక్షుడు జోకో విడోడోకు అనుకూలంగా బ్యాలెట్ పత్రాలపై మార్కు చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. మలేషియాలో దాదాపు పది లక్షల మంది ఇండోనేసియన్ ఓటర్లు ఉంటారని అంచనా వేసి వాటిపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.  మొత్తం 17,000కు పైగా దీవులు... 19.2 కోట్ల మంది ఓటర్లు గల ఇండోనేషియాలో దేశ అధ్యక్ష పీఠం మొదలుకుని, స్థానిక సంస్థల వరకు ఒకేరోజు ఎన్నికలు నిర్వహించిన విషయం విధితమే. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top