ఇక ఆఫీస్‌లో నిద్ర పోలేరు...

Japanese Technology Detects Tired Workers Wake Up Them - Sakshi

టోక్యో : తిన్న తర్వాత కాసేపు ఓ కునుకు తీయాలనిపించడం సహజం. కానీ ఆఫీస్‌లో కూడా ఇలా కునుకు తీయాలనిపిస్తే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కారణం ఆఫీస్‌లో నిద్రపోతే ఊరుకోరు.. మరో విషయం ఏంటంటే అలా నిద్ర వస్తున్న భావన ఉన్నప్పుడు చేసే పని మీద సరిగ్గా దృష్టి కేంద్రికరించలేము. ప్రాంతంతో సంబంధం లేకుండా ఈ సమస్య ఎక్కడైనా సాధారణమే. శ్రమ జీవులుగా పేరు తెచ్చుకొన్న జపాన్‌ వాసులను ఈ నిద్ర సమస్య మరింత వేధిస్తోందంట. దాంతో ఉద్యోగులను మెలకువగా ఉంచడం ఎలా అంటూ ప్రయోగాలు నిర్వహిస్తున్నారు ఆ దేశ శాస్త్రవేత్తలు. ఈ సందర్భంగా కొందరు వ్యక్తుల మీద పరిశోధనలు నిర్వహించారు.

దానిలో భాగంగా ప్రయోగంలో పాల్గొన్న వారికి మ్యాథ్స్‌ ప్రాబ్లమ్స్‌ ఇచ్చి వాటిని పరిష్కరించమని చెప్పారు. అలానే వారు ఉన్న గదిలో వేర్వేరు వాతావరణ పరిస్థితులు కల్పించారు. దీనిలో భాగంగా ఒకసారి గదిలో ఉష్ణోగ్రతను తగ్గించడం బాగా చల్లగా ఉండేలా చూడటం, మరోసారి వెలుతురు బాగా వచ్చేలా చేయడం.. గదిలో వివిధ పరిమళాలు వ్యాపించేలా చేశారు. అయితే వీటన్నింటిలో.. గదిలో ఉష్ణోగ్రతలు తగ్గించినప్పుడు మెరుగైన ఫలితాలు కనిపించాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఉద్యోగులకు నిద్ర మత్తుగా అనిపించినప్పుడు గదిలో ఉష్ణోగ్రతలు తగ్గించి, చల్లగా ఉండేలా చేస్తే వారు మళ్లీ చురుగ్గా మారుతున్నారని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

ఈ ప్రయోగం ఆధారంగా జపాన్‌కు చెందిన రెండు దిగ్గజ తయారీ కంపెనీలు డైకిన్‌(ఏసీల తయారీ కంపెనీ), ఎలాక్ట్రానిక్‌ ఉత్పత్తుల కంపెనీ ఎన్‌ఈసీలు ఒక నూతన సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తోన్నాయి. దీనిలో భాగంగా వీరు ఉద్యోగుల కంప్యూటర్‌కు కెమరాలను అమర్చారు. అవి ఉద్యోగుల కంటి కదలికలను గమినిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే వారి కళ్లు నిద్రలోకి జారుకున్నట్లు మత్తుగా అనిపిస్తాయో అప్పుడు వెంటనే గది ఉష్ణోగ్రతను తగ్గించి, చల్లగా ఉండే ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతో ఉద్యోగులు మళ్లీ చురుగ్గా తయారవుతున్నారు. ఇంకా ప్రయోగ దశలోనే ఉన్న ఈ పద్ధతిని పూర్తిగా అభివృద్ధి చేసి 2020 నాటికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి.

జపాన్‌ శ్రామిక చట్టాల ప్రకారం అక్కడి ఉద్యోగులు ఎవరైనా వారంలో ఐదు రోజులు కేవలం నాలుగు గంటలు మాత్రమే పనిచేయాలి. కానీ ఈ నియమాలను అక్కడి యాజమాన్యం కానీ, ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు. ఇప్పటికే జపాన్‌ వాసులు సగటున వారానికి 60 గంటలు పనిచేస్తున్నారు. ఈ అధిక పని గంటల వల్ల వారు త్వరగా మృత్యువాత పడుతున్నట్లు అక్కడి నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయినప్పటికి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top