జపాన్‌ పాస్‌పోర్ట్‌.. మోస్ట్‌ పవర్‌ఫుల్‌ | Japanese passport is the most powerful in the world | Sakshi
Sakshi News home page

జపాన్‌ పాస్‌పోర్ట్‌.. మోస్ట్‌ పవర్‌ఫుల్‌

Oct 11 2018 3:36 AM | Updated on Oct 11 2018 3:36 AM

Japanese passport is the most powerful in the world - Sakshi

పాస్‌పోర్ట్‌కు పవర్‌ ఏంటి అనుకుంటున్నారా? పాస్‌పోర్ట్‌లకు కూడా పవర్‌ ఉంటుంది. అంటే.. పవర్‌ఫుల్‌ పాస్‌పోర్ట్‌ ఉంటే వీసా అవసరం లేని ప్రయాణాలకు ఎక్కువ అవకాశం ఉంటుంది.  ఏ దేశానికైతే అత్యధిక విదేశాలకు వెళ్లడానికి వీసా అవసరం లేదో ఆ దేశ పాస్‌పోర్ట్‌ను అత్యంత శక్తిమంతమైనదిగా పరిగణిస్తారు. ఆ ప్రాతిపదికన ప్రస్తుతం జపాన్‌ పాస్‌పోర్ట్‌ ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌గా నిలిచింది. జపాన్‌ పాస్‌పోర్ట్‌తో ప్రపంచంలోని 190 దేశాలకు వీసా అవసరం లేకుండానే వెళ్లొచ్చు. జపాన్‌ దేశస్తులు వీసా అవసరం లేకుండా వెళ్లే 190వ దేశంగా మయన్మార్‌కు ఇటీవలే గుర్తింపు లభించింది. అంటే, జపాన్‌ పాస్‌పోర్ట్‌ ఉన్నవారు 190 దేశాలకు వీసా లేకుండా కానీ, ఆ దేశంలో దిగగానే విమానాశ్రయంలోనే వీసా పొందే అవకాశంతో కానీ ప్రయాణం చేయొచ్చు.

ఈ పవర్‌ఫుల్‌ పాస్‌పోర్ట్‌ దేశాల జాబితాలో రెండో స్థానంలో 189 దేశాలతో సింగపూర్, మూడో స్థానంలో 188 దేశాలతో ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణాఫ్రికాలు నిలిచాయి. మన భారత్‌ స్థానం ఏంటని ఆలోచిస్తున్నారా? మన పాస్‌పోర్ట్‌తో వీసా లేకుండా కానీ, వీసా ఆన్‌ అరైవల్‌ విధానం ద్వారా కానీ 59 దేశాలకు వెళ్లొచ్చు. అంటే పవర్‌ఫుల్‌ పాస్‌ పోర్ట్‌ ఉన్న దేశాల జాబితాలో మన స్థానం 76. ఈ మధ్యే 78 నుంచి 76వ స్థానానికి ఎదిగాం. అగ్రదేశాలైన అమెరికా లేదా బ్రిటన్‌ల పాస్‌పోర్ట్‌తో 186 దేశాలను వీసా లేకుండా చుట్టేయొచ్చు. ప్రస్తుతం ఈ దేశాల స్థానం ఐదు కాగా, 2015లో ఈ రెండే అగ్రస్థానంలో ఉన్నాయట. విశేషమేంటంటే.. ఈ రేసులో ముందంజలో ఉంది యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌. ఈ దేశం 2006లో ఉన్న 62వ స్థానం నుంచి వేగంగా ముందంజ వేసి ఇప్పుడు 21వ స్థానానికి చేరింది. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ డేటా ఆధారంగా హెన్లీ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌ ఈ ర్యాంకింగ్‌లు రూపొందించింది.
 

లాభాలేంటి?
సాధారణంగా వీసా లేనిదే విదేశీ పర్యటనలు సాధ్యం కాదు. దాని కోసం డబ్బు కట్టి దరఖాస్తు చేసుకుని అవసరమైతే ఇంటర్వ్యూ, ఆపై ప్రాసెసింగ్‌ పూర్తయితే వీసా వస్తుంది. అలాంటి వీసా అవసరమే లేకుండా పాస్‌పోర్ట్‌తోనే విదేశీ పర్యటనలకు వెళ్లడం ఈజీ కదా. ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా దేశాల మధ్య ఈ సదుపాయం ఏర్పడుతుంది. యూరోపియన్‌ యూనియన్‌తో ఒప్పందాల కారణంగా ఆయా దేశాల్లో వీసా ఫ్రీ పర్యటనకు అవకాశం లభిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement