333 తిమింగలాలు ఊచకోత..

Japan Expedition, Over 120 Pregnant Minke Whales Killed - Sakshi

122 గర్భిణీ తిమింగలాల ఉసురు తీసిన జపాన్‌

టోక్యో:  బూడిద రంగు తిమింగలాలపై పరిశోధనల పేరుతో జపాన్‌ చేపట్టిన దుర్మార్గమైన సముద్ర వేటలో 333 తిమింగలాలు హతమయ్యాయి. జపాన్‌ ఊచకోత కోసిన 128 ఆడ తిమింగలాల్లో 122 గర్భంతో ఉన్నట్లు ఒక రిపోర్టు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. దక్షిణ అంటార్కిటికా మహా సముద్రంలో పరిశోధనల పేరిట జపాన్‌ ఈ ఘాతుకానికి పాల్పడింది.

కాగా, 2014 మార్చిలో అంతర్జాతీయ న్యాయస్థానం జపాన్‌ చర్యలపై స్పందించింది. పరిశోధనల పేరుతో బూడిద రంగు తిమింగలాల విచ్చలవిడి వేటను నిలిపేయాలని ఆదేశించింది. తిమింగలాల వేటను వ్యాపార అవకాశంగా జపాన్‌ మారుస్తోందని కోర్టు ఆక్షేపించింది. ప్రతి ఏటా డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు 12 వారాల పాటు నిర్విరామంగా జపాన్‌ సముద్ర యాత్ర చేస్తుంది.

అయితే, ఐసీజే ఉత్తర్వులు, అంతర్జాతీయ ఒత్తిళ్ల కారణంగా జపాన్‌ తన వైఖరి మార్చుకుంది. ఏటా దాదాపు 900 పైగా తిమింగలాలను వేటాడే బదులు ఈ ఏడాది 333 తిమింగలాలకే పరిమితమైంది. బూడిద రంగు తిమింగలాల సంఖ్య, వాటి ప్రవర్తన, జీవ శాస్త్రీయ అధ్యయనం కోసం వేటాడుతున్నామనీ, తిమింగలాల వేట తమ సంస్కృతిలో భాగమని జపాన్‌ వాదిస్తోంది.

కాగా, ఈ ఘటనపై తిమింగలాల పరిరక్షణ సమితి మాత్రం పెద్ద ఎత్తున్న ఉద్యమించేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు మూగజీవాల పట్ల జపాన్‌ ప్రభుత్వం కొనసాగించిన దమనకాండపై జంతు పరిరక్షణ సమితులు సోషల్‌ మీడియాలో దుమ్మెత్తిపోస్తుండగా.. ఈ వేట ప్రతి యేటా జరిగే తంతేనని కొందరు కొట్టిపారేస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top