అంతరిక్షంలో బ్యాక్టీరియా బెడద

International Space Station is crawling with bacteria - Sakshi

భూమిపై జిమ్, ఆస్పత్రుల్లో ఉన్న బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తింపు

వ్యోమగాముల ఆరోగ్యానికి హాని!

వాషింగ్టన్‌: అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో కూడా సూక్ష్మజీవుల బెడద తప్పట్లేదు. అక్కడ బ్యాక్టీరియా, శిలీంధ్రం వంటి సూక్ష్మజీవులు ఉన్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. దీంతో అక్కడి వ్యోమగాముల ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఐఎస్‌ఎస్‌లో భూమిపై ఉండే జిమ్, ఆస్పత్రుల్లో ఉండే అన్ని సూక్ష్మజీవులు ఉన్నట్లు కనుగొన్నారు. వీటిని కనుగొనడం వల్ల వ్యోమగాముల ఆరోగ్య సంరక్షణ కోసం, అంతరిక్షంలోకి ప్రయాణం చేసేటప్పుడు, అక్కడ నివసించేందుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవచ్చని నాసా పేర్కొంది.

‘ఐఎస్‌ఎస్‌ వంటి మూసి ఉన్న ఆవరణలో సూక్ష్మజీవులు ఎంత కాలం జీవించి ఉంటాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది’అని పరిశోధన బృందంలోని భారత సంతితికి చెందిన కస్తూరి వెంకటేశ్వరన్‌ వివరించారు. అక్కడ కనుగొన్న బ్యాక్టీరియాలో 26 శాతం స్టెఫైలోకోకస్, 23 శాతం పాంటియా, 11 శాతం బాసిల్లస్‌ ఉన్నట్లు ఆయన తెలిపారు. మానవుడి జీర్ణవ్యవస్థలో ఉండే ఎంటిరోబ్యాక్టర్, స్టెఫైలోకోకస్‌ ఆరియస్‌ (10 శాతం)ను గుర్తించినట్లు చెప్పారు. అయితే ఇవి వ్యోమగాములు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయా లేదా అన్న విషయం ఇంకా తెలియదని తెలిపారు. అంతరిక్షంలో ఆ వాతావరణంలో బ్యాక్టీరియాలు క్రియాశీలకంగా ఉంటాయా లేదా అనేది కూడా పరిశోధించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఐఎస్‌ఎస్‌లోని లోపలి ఉపరితలంలో 8 ప్రాంతాల్లో (కిటికీ, టాయిలెట్, డైనింగ్‌ టేబుల్‌..) సేకరించిన నమూనాలను పరిశీలించగా ఈ విషయం తెలిసింది.

అరుణ గ్రహంపై జీవం
అరుణగ్రహంపై జీవం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంగారకుడికి చెందిన ఉల్కపై బ్యాక్టీరియా ఉందని వారు లండన్‌కు చెందిన పరిశోధకులు గుర్తించారు. దీన్ని బట్టి అంగారకుడిపై ఒకప్పుడు జీవం ఉండొచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. 1977–78 మధ్య అంటార్కిటికా ప్రాంతంలో జపాన్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోలార్‌ రీసెర్చ్‌ జరుపుతున్న తవ్వకాల్లో ఏఎల్‌హెచ్‌–77005 అనే ఉల్క దొరికినట్లు శాస్త్రవేత్తలు వివరించారు. దీనిపై హంగేరియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ ఆస్ట్రానమీ, ఎర్త్‌ సైన్సెస్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ ఉల్కను అధ్యయనం చేసి బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. ఈ ఉల్క లోపల సేంద్రియ పదార్థ రూపంలో బ్యాక్టీరియా ఉందని కనుగొన్నట్లు ఇల్డికో గ్యొల్లయ్‌ అనే శాస్త్రవేత్త తెలిపారు. ‘భౌగోళిక, జీవ, రసాయన, వాతావరణ శాస్త్ర రంగాలకు చెందిన పరిశోధకులకు మా పరిశోధనలు ఎంతో మేలు చేస్తాయి’అని ఇల్డికో చెప్పారు. తమ పరిశోధనతో భవిష్యత్తులో ఉల్కలు, గ్రహ శకలాలను అధ్యయనం చేసే తీరు మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top