చైనాకు దెబ్బ : ఇండియాకే ప్రాధాన్యం

India may be Apples next big production hub - Sakshi

ఆపిల్‌  నెక్ట్స్‌  ప్రొడక్షన్‌ కేంద్రం ఇండియానే

5 వ వంతు ఉత్పత్తిని  ఇండియాకు తరలించే యోచన

సాక్షి, న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ సంస్థ భారత దేశంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది. తన ఉత్పత్తి సామర్థ్యంలో దాదాపు ఐదో వంతు  చైనా  నుండి భారతదేశానికి తరలించాలని యోచిస్తోందని నివేదికల ద్వారా తెలుస్తోంది. దేశంలో స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన భారత ప్రభుత్వ కొత్త ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాలు (పీఎల్‌ఐ) పథకం ద్వారా  ప్రయోజనాలను పొందాలని  ఆపిల్‌ భావిస్తోందట.

ఈ మేరకు గత కొన్ని నెలలుగా ఆపిల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, ప్రభుత్వ ఉన్నతాధికారుల మధ్య పలు భేటీలు కూడా పూర్తయ్యాయని, రాబోయే ఐదేళ్ళలో సుమారు 40 బిలియన్ డాలర్లు విలువైన ఉత్తులను తీసుకురానుందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. ఇదే జరిగితే, ఐఫోన్ తయారీదారు భారతదేశపు అతిపెద్ద ఎగుమతిదారుగా మారవచ్చని నిపుణులు అంటున్నారు. గత ఏడాది చివర్లో భారత ప్రభుత్వం స్థానిక సోర్సింగ్ నిబంధనలపై ఇచ్చిన సడలింపులపై ఆపిల్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపడం గమనార్హం.

ప్రస్తుతం, ఆపిల్ తన స్మార్ట్‌ఫోన్‌లు  ఇతర ఉత్పత్తుల ఉత్పత్తి కోసం తయారీదారులైన ఫాక్స్‌ కాన్, విస్ట్రాన్‌లను ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా  ఈ కాంట్రాక్టర్ల ద్వారానే  భారతదేశంలో 40 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్‌లను ఉత్పత్తి చేయాలని  యోచిస్తోంది. ప్రధానంగా ఈ ఉత్పత్తులను ఎక్కువగా ఇతర మార్కెట్లకు ఎగుమతి చేయనుంది. భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చాలా తక్కువ మార్కెట్‌ శాతం ఉన్న నేపథ్యంలో  ఎగుమతి ప్రయోజనాల కోసం  ఉత్పత్తి   సామర్ధ్యాన్ని పెంచనుందని అంచనా. దేశీయంగా ఆపిల్  ఐఫోన్ 7 ఐఫోన్ ఎక్స్‌ఆర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఐఫోన్ ఎస్‌ఈ, ఐఫోన్ 6 ఎస్ కూడా ఇక్కడే ఉత్పత్తి చేయాలని భావించినా, గ్లోబల్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో  నుండి వీటిని  తొలగించడంతో  దీనికి  బ్రేక్‌ పడింది.  (భారీ పెట్టుబడులు, రైట్స్ ఇష్యూ : రిలయన్స్  దూకుడు)

ఆపిల్ ప్రస్తుతం భారతదేశంలో  రీసెల్లర్స్‌ ద్వారా  మాత్రమే  తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఇటీవల  దేశంలో రిటైల్ స్టోర్ల ఏర్పాటు ప్రయత్నాలను వేగవంతం చేస్తోందన్న అంచనాలు కూడా భారీగా  ఉన్నాయి. 2021 లో  దేశంలో  మొట్టమొదటి ఆపిల్ రిటైల్  స్టోర్‌ను  ప్రారంభించాలని భావిస్తున్నట్టు ఫిబ్రవరిలో పెట్టుబడిదారుల సమావేశంలో ఆపిల్‌ సీఈవో టిమ్ కుక్  ప్రకటించడం ఈ వార్తలకు బలాన్నిస్తోంది. మరోవైపు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) ఇటీవల ఇచ్చిన నివేదిక ప్రకారం, ఆపిల్ గత త్రైమాసికంలో భారతదేశ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 62.7శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది.  కాగా ఈ నివేదికలను ఆపిల్‌ ఇంకా ధృవీకరించలేదు.  (పీఎన్‌బీ స్కాం:  నీరవ్‌ మోడీ విచారణ షురూ!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top